వేల కోట్ల నష్టాలను మూటకట్టుకుని భారంగా అడుగులు వేస్తున్న ఆర్టీసీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కనికరం చూపారు. ఆర్టీసీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులు సూచించిన ప్రతిపాదనలకు కేసీఆర్ అంగీకరించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా వెయ్యి కొత్త బస్సులను సమకూర్చుకునే వెసులు బాటు కలగనుంది. అంతేకాదు.... తక్షణమే 5 వందల బస్సుల కొనుగోలుకు రూ. 150 కోట్లు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ అంగీకరించారు. ఈ చర్యతో ఆర్టీసీ సర్వీసులు విస్తరించుకునే అవకాశం కలిగింది. ఆర్టీసీ ఎదుర్కొంటున్న మరో సమస్య పన్నుపోటు. వాస్తవానికి ఆర్టీసీకి వచ్చే సొమ్మును ప్రభుత్వం భారీగా పన్ను రూపంలో తన ఖజానాలో వేసుకుంటోంది. ప్రజలకు ఉపయోగపడే సర్వీసు అన్న ఉద్దేశంతో రాయితీలు ఇవ్వాల్సిందిపోయి.. ఆర్టీసీని కామథేనువుగా భావించి అందినంతవరకూ పిండుకోవడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. అందుకే ఆర్టీసీ అద్దె బస్సులపై ప్రస్తుతం ఉన్న 14.5 వ్యాట్ శాతాన్ని తగ్గించాలని ఆర్టీసీ ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తోంది. దీనిపై కేసీఆర్ ఇప్పటికిప్పుడు నిర్ణయం వెలువరించకపోయినా... సానుకూలంగా స్పందించారు. నిధులు, పన్నులు వంటి విషయాలతో పాటు పాలన పరమైన అంశాలపైనా కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లో మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తోపాటు ఇద్దరు ఆర్‌ఎంలను నియమించేందుకు అంగీకరించారు. ఆర్టీసీలో తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లకు తగు శిక్షణ ఇచ్చి పర్మినెంట్ చేసే విషయంలోనూ కేసీఆర్ సుముఖంగానే ఉన్నట్టు తెలిసింది. పనిలో పనిగా కేసీఆర్ కొన్ని సూచనలు కూడా చేశారట. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా ఆర్టీసీ బస్సులకు రంగులు వేయాలని అధికారులకు సూచించారు. అంటే గులాబీ రంగు వేయమని ఇండైరెక్టుగా సూచించారు. ఇక త్వరలోనే తెలంగాణలోని ఆర్టీసీ బస్సులు గులాబీ రంగు పులుముకుంటాయన్నమాట..

మరింత సమాచారం తెలుసుకోండి: