కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇంతవరకూ మంత్రివర్గంలో స్థానం దక్కని మరికొన్ని వర్గాలకు చోటు కల్పించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఈదిశగా ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదు నెలలుగా మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సోమవారం సమావేశమై...పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ పై నిర్ణయం తీసుకోనుంది. నవంబరు మూడో వారంలో పార్లమెంట్ -ఉభయసభలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. రాజకీయంగా, పాలన పరంగా కేబినెట్ విస్తరణ తప్పనిసరి అవుతోంది. చాలా శాఖాల్లో సిబ్బంది అదనపు భారాన్ని మోస్తున్నారు. అదే విధంగా మంత్రులు కూడా అదనపు శాఖల బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అదనంగా రక్షణశాఖ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అదే విధంగా నితిన్ గడ్కరీ తనకు కేటాయించిన రవాణశాఖతో పాటు అదనంగా గ్రామీణాభివృద్ధి శాఖను కూడా నిర్వహిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే గోపీనాథ్ ముండే మరణించడంతో ...ముండే నిర్వహించే గ్రామీణాభివృద్ధిశాఖ బాధ్యతల్ని గడ్కరీకి అప్పగించారు. మరో సీనియర్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కమ్యూనికేషన్ శాఖతో పాటు న్యాయశాఖను కూడా నిర్వహిస్తున్నారు. పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్...సమాచార మంత్రిగా అదనపు బాధ్యతల్ని మోస్తున్నారు. మంత్రులేకాదు...ముఖ్యమైన అధికారులతో సొంత టీమ్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు ప్రధాని. ఈ దిశగా ఇప్పటికే ఆర్ధికశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహ్రిషి... ప్రధాని ఆర్ధిక సలహాదారునిగా అరవింద్ సుబ్రహ్మణ్యియన్ నియమితులయ్యారు. మరికొంతమంది ముఖ్య అధికారులు సైతం మోదీ బృందంలో చేరతారని చెబుతున్నారు. కొత్త కేబినెట్ కార్యదర్శి, సీబీఐ చీఫ్ నియామకాలకు కూడా త్వరలోనే మూహూర్తం ఖరారవుతుందని అంటున్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ముగిశాయి... బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని కులాలకు తన టీమ్ లో ప్రాతినిధ్యం కల్పించాలని మోదీ భావిస్తున్నారు. ఈదిశగా ఈసారి కచ్చితంగా భూమిహార్ -కులానికి చెందిన నేతలకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్ లో బీజేపీకి ఈ వర్గం అండగా ఉండడంతో...ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గం మద్దతుగా రాజకీయంగా పరిస్థితిని పటిష్ఠం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు నరేంద్ర మోదీ. హర్యానాలో పార్టీ తొలిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్టు పోల్ సర్వేలు అంచనా వేయడంతో... జాట్ వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని భావిస్తున్నారు. హర్యానాలో జాటేతర వర్గాలకు ముఖ్యమంత్రి ఇవ్వడం ద్వారా... జాట్ ల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్నది మోదీ వ్యూహంగా భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: