ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే.. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తక్కువ. ప్రముఖమైన దేవాలయాలు ఉన్నా.. వాటి అభివృద్ధి అంతంత మాత్రమే.. భద్రాచలం రామయ్య తర్వాత.. యాదగిరిగుట్ట ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.. ఇప్పుడీ ప్రముఖ పుణ్యక్షేత్రానికి మహర్దశ పట్టనుంది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆలయ గర్భగుడి గోపురం ఎత్తు పెంచడంతోపాటు స్వర్ణ గోపురం నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆలయ మండపం ఇరుకుగా ఉన్నందున ఉత్తర, దక్షిణాలవైపు విస్తరణను శాస్ర్తోక్తంగా చేపడతామని తెలిపారు. గుట్టపైనున్న ఇతర అస్తవ్యస్థ నిర్మాణాలను సైతం ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం పునర్నిర్మిస్తామని సీఎం అన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో పూర్తిస్థాయి టెంపుల్ సిటీగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్రకటించారు. సీఎం హోదాలో తొలిసారి నల్లగొండ జిల్లాకు వచ్చిన కేసీఆర్.. గుట్ట పరిసర ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. దైవదర్శనం అనంతరం జిల్లా ముఖ్య అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. యాదగిరి గుట్ట చుట్టూ రెండు వేల ఎకరాల భూమిలో ఆధ్యాత్మిక, పర్యాటక సంబంధిత కార్యక్రమాలు చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, ఆధ్మాత్మిక కేంద్రాలు, విల్లాలు, కాటేజ్‌లు నిర్మిస్తామని తెలిపారు. మరో 400 ఎకరాల భూమిని నృసింహ అభయారణ్యంగా తీర్చిదిద్ది, జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాదు.. దేవస్థానం ఆధ్వర్యంలో వేద పాఠశాలను ప్రారంభిస్తామని చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. సుమారు రూ.60 కోట్లకు పైగా ఆదాయంతో, రూ.30 కోట్ల మిగులు ఉన్న దేవస్థానానికి టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా పట్టు వస్ర్తాలు సమర్పించే ఆనవాయితీని అమలు చేస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: