గత సార్వత్రిక ఎన్నికల సమరం సమయంలో బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేసిన అంశాల్లో బ్లాక్ మనీ ఒకటి. ఈ విషయంపై యూపీఏ సర్కారు తీరును తూర్పారబట్టిన కమలనాథులు.. తమకు అధికారమిస్తే.. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీసి.. పేదల సంక్షేమం కోసం ఖర్చుచేస్తామన్నారు. ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ నుంచి నరేంద్ర మోడీ వరకూ అంతా ఈ మాట చెప్పినవారే. ఆనాటి మన్మోహన్ సర్కారుకు నల్లధనం వివరాలు బయటపెట్టే ధైర్యం కూడా లేదని మోడీ ఎన్నోసార్లు ఎద్దేవా చేశారు. కానీ అధికారంలోకి వస్తే కానీ అసలు చిక్కులు అర్థం కావని మోడీ తీరు మరోసారి రుజువు చేస్తోంది. జనం కూడా బీజేపీ మాటలను బాగా నమ్మారు. మోడీలాంటి ధైర్వవంతుడైన నాయకుడు వస్తే.. ఎలాగైనా విదేశాల్లోని నల్లధనం భారత్ కు నడచివస్తుందని ఆశించారు. కానీ అలా ఆశలు పెట్టుకోవడంలో ఉపయోగం ఏమీ ఉండదని తేలిపోతోంది. ఈ విషయంలో మోడీ సర్కారుపై భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. విదేశాల్లోని నల్లధనం వివరాలను కనీసం బయటకు చెప్పేందుకు కూడా కుదరదని మోడీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది. అలా సమాచారాన్ని బహిర్గతం చేయడానికి విదేశాలు అంగీకరించడం లేదని చెప్పింది. గతంలో మన్మోహన్ సర్కారు కూడా ఈ మాటే చెప్పింది. నల్లధనం విషయంలో మోడీ సర్కారు వైఖరి మొదటి నుంచి ఇలాగే ఉంది. ఎన్నికలవేళ విదేశీ బ్యాంకుల్లో లక్షల కోట్లు మూలుగుతున్నాయని ప్రచారం చేసిన ఆ పార్టీ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. అబ్బే అంతలేదని.. వేల కోట్లు మాత్రమే అని లెక్కలు తేల్చింది. కనీసం ఆ వివరాలు కూడా బయటపెట్టే ప్రయత్నం చేయడం లేదు. చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు... అమలు దగ్గరకు వచ్చేసరికే అసలు విషయం బయటపడుతుందన్న సంగతి మోడీ సర్కారును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచినవారిని రక్షించేందుకు ఎన్డీఏ సర్కారు ప్రయత్నిస్తోందని ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: