పొంగులేటి.. ఈ పదం వినపడగానే ముందుగా కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి గుర్తుకు వస్తారు. కొన్ని నెలలుగా మరో పొంగులేటి.. సుధాకర్ రెడ్డి కంటే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు. ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ నేత.. తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. అది కూడా వైకాపా తరపున తెలంగాణలో గెలవడం అంటే సాధారణ విషయం కాదు. నామా నాగేశ్వరరావు, సీపీఐ నారాయణ వంటి దిగ్గజాలను ఢీకొని.. తెలంగాణలో వైకాపా తరపున గెలవడం సంచలనం సృష్టించింది. తెలంగాణ మొత్తం మీద వైకాపాకు దక్కిన ఒకే ఒక స్థానం ఇతనిదే. శీనన్నను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తా అని కూడా జగన్ ఎన్నికల సభల్లో ఖమ్మం ప్రజలకు హామీ ఇచ్చాడు. వైకాపా తెలంగాణపై ఆశలు వదిలేసుకుని ఏపీపైనే ప్రధానంగా దృష్టిపెడుతున్నసంగతి తెలిసిందే.. చంద్రబాబు తరహాలో జగన్ కూడా ఏపీకే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాంటి సమయంలో తెలంగాణ కు వైకాపా అధ్యక్షుడుగా ఎవరిని ఉంచాలని జగన్ ఆలోచించి... చివరకు పొంగులేటివైపే మొగ్గాడు. తెలంగాణలో వైకాపా పగ్గాలు పొంగులేటి చేతికి అప్పగించేశారు. అది ఎలాంటి పార్టీ అయినా.. ఓ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడు కావడమంటే చిన్న విషయమేం కాదు. అదీ తొలిప్రయత్నంలోనే ఆ అవకాశం అందుకున్న ఖమ్మం ఎంపీ తొలిరోజుల్లోనే తడబడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఓ సభలో తమ ప్రధాన శత్రువైన చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించి.. పార్టీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలంటూ.. విద్యుత్ విషయంలో చంద్రబాబు ముందు చూపుతో వ్యవహరించాలని పొగిడేశారు. ఇప్పుడీ కామెంట్ వైకాపా అగ్రనేతలకు కోపం తెప్పించాయట. ఆ మాత్రం రాజకీయ జ్ఞానం లేకపోతే ఎలా.. అని తలపట్టుకుంటున్నాయట. మరి హెచ్చరికతో సరిపెడతారో.. ఇచ్చిన పదవి పీకేస్తారో.. ఏం చేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: