ఇంతకీ హుదూద్ బాధితులకు సరైన స్థాయిలో సౌకర్యాలు, సహాయం అందాయా? లేదా?! అనేది ఒక మిస్టరీగా మారింది. దేశం ఎన్నడూ ఎరగని రీతి తుపానును ఎదుర్కొంది విశాఖ పట్టణం. నాలుగు తుపానులు ఒకేసారి విరుచుకుపడినంత తీవ్ర స్థాయిలో హుదూద్ విరుచుకుపడింది. ఇటువంటి నేపథ్యంలో తీవ్రమైన నష్టమూ సంభవించింది. మరి ప్రభుత్వం తుపాను బాధితులను బాగా ఆదుకొందా?! లేదా?! అంటే మాత్రం సరైన సమాధానం లేదు. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో తుపాను బాధితులను ఆదుకోవడంలో తాము విజయంసాధించామని.. చెబుతారు. ఆయన తొలిరోజే ఈ తరహా ప్రకటన చేశారు. టెక్నాలజీని అడ్డుపెట్టి తుపానును ఎదుర్కొన్నామని బాబు ప్రకటించేశారు! మరి తొలి రోజే ఆ విధమైన ప్రకటన చేసినప్పటికీ .. ఇప్పటి వరకూ బాధితులకు పౌరసరఫరాల శాఖ తరపున కనీసం బియ్యం అందుతున్న పరిస్థితులు కూడా లేవని తెలుస్తోంది! తాజాగా చంద్రబాబు నాయుడు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను బాధితులకు నిత్యవసరాలు అందజేయడంలో విఫలం అయ్యారంటూ బాబు వారిని నిందించారు. హుదూద్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విఖలో సహాయక చర్యలపై చంద్రబాబు తాజాగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ అంతంత మాత్రంగా జరుగుతుందని... పూర్తి స్థాయిలో రేషన్ పంపిణీ జరిగే విధంగా చూడాలని చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.కూలీలు, వాహనాల కొరత తీవ్రంగా ఉందని... ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలంటే మరో 10 రోజులు పడుతుందని బాబుకు తెలపడంతో ఆయన ఆగ్రహోద్రిక్తుడయ్యాడు. మరి సహాయ చర్యల్లో విఫలమయ్యారంటూ బాబు ఈ విధంగా అధికారులుపై విరుచుకుపడటం అనేది కొనసాగుతోంది. అదే సమయంలో సహాయక చర్యలు విజయవంతం అయ్యాయని, తాము తుపానును అద్భుతరీతిలో ఎదుర్కొన్నామని కూడా ప్రకటన చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధంఅనేది మాత్రం మిస్టరీనే!

మరింత సమాచారం తెలుసుకోండి: