ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ టానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. అయితే, మహారాష్ట్రలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు వున్నట్లు అత్యధిక ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించటంతో ప్రధానపార్టీలలో ఉద్విగత, ఉత్కంఠ నెలకొన్నది. గెలుపుపై మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. సంపూర్ణ మెజారిటీ సాధిస్తామని మాజీ కాషాయమిత్రులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపి మాత్రం ప్రభుత్వ ఏర్పాటులో తమది కీలకపాత్ర అని చెబుతోంది. మరోసారి పొత్తు కుదుర్చుకునే అవకాశాలను బిజెపి, శివసేన కొట్టిపారేస్తు న్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీగా నష్ట పోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. ఆదర్శ్‌ కుంభకోణం విషయంలో తన ముందు పనిచేసిన ముగ్గురు ముఖ్యమంత్రులపై విమర్శలు చేయడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నారని ఆ పార్టీ సీనియర్‌ నాయకులే విమర్శలు గుప్పించారు. చవాన్‌ వ్యాఖ్యల కారణంగానే నాలుగోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. బిజెపితో ఎలాంటి వైరుధ్యాలు లేవని కొంత మెతక వైఖరితో మాట్లాడిన మరుసటి రోజు శనివా రమే తాము సంపూర్ణ మెజారిటీ సాధిస్తామని శివసేన ప్రగల్భాలు పలికింది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని తెలిపింది. బిజెపి మద్దతు తమకు అవసరం లేదని తేల్చిచెప్పింది. 'మహారాష్ట్రలో ఒక పార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. ఈ ఎన్నికల్లో ఎన్‌సిపి, కాంగ్రెస్‌ చచ్చిన పాములు. మేము బిజెపిపైనే పోరాటం చేశాం. బిజెపితో మాకు ప్రేమ, భావోద్వేగ బంధం ఉంది. మా మధ్య సైద్ధాంతికపరమైన వైరుధ్యాలు తలెత్తాయి. హృదయాలు పగిలిపోయాయి. బిజెపి పటిష్టమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని మేము కోరుకుంటున్నాం. శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిజెపితో కలిసి పనిచేస్తాం' అని శివసేన పార్టీ ప్రతినిధి సంజరు రౌత్‌ వెల్లడించారు. విదర్భ రాష్ట్రం ఏర్పాటుపై బిజెపితో తమ పార్టీకి గల వైరుధ్యాలపైనా శివసేన ఎంపీ రౌత్‌ మాట్లాడారు. విదర్భ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై బిజెపి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమన్నారు. కాగా, ఎన్నికలకు ముందు శరద్‌పవార్‌ శివసేన పట్ల మెతకగానే వున్నారు. బాల్‌ థాకరే మరణం తర్వాత పార్టీ నిర్మాణానికి ఉద్ధవ్‌ థాకరే విశేషంగా కృషి చేశారని పవార్‌ పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం కోసం ఉద్ధవ్‌ రాష్ట్రమంతా పర్యటించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బిజెపి విజయంలో శివసేన పాత్ర కీలకంగా వుందని పవార్‌ చెప్పారు. బాల్‌ థాకరేతో సైద్ధాంతిక వైరుధ్యాలు వున్నప్పటికీ ఆయనతో పవార్‌ మంచి సంబంధాలనే కొనసాగించారు. ఎన్‌సిపితో పొత్తు విచ్ఛిన్నం తర్వాత ఆ పార్టీపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. బిజెపికి దగ్గరవడానికి ఎన్‌సిపి ప్రయత్నిస్తున్నదని మండి పడింది. ఈ ఆరోపణలను ఎన్‌సిపి ఖండించినప్పటికీ కొత్తపార్టీలతో ఎన్నికల అనంతర పొత్తులకు అవకాశం వుంటుందని, ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకపాత్ర పోషిస్తామని ఎన్‌సిపి నేత ప్రఫుల్‌ పటేల్‌ స్పష్టంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: