‘మేమే కనుక రాజకీయం చేయాలనుకుంటే, అధికార పక్షం సప్త సముద్రాలు దాటి వెళ్లిపోతుంద’ని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని విమర్శించడం శోచనీయమని అన్నారు. తుపాను వస్తుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ముందుగా అధికారులను, ఆహార పదార్థాలను ఆయా ప్రాంతాలకు పంపలేకపోయారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పలు తుపానులు వస్తే సమర్థవంతగా ఎదుర్కొన్నామని ఆయన చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను పాజిటివ్‌గా తీసుకుని, తమ తప్పులు సరిచేసుకున్నామని రఘువీరా చెప్పారు. గిరిజనులను కొండ దిగి కిందకు రమ్మనడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. తానొక్కడినే తుపాను సహాయం చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను చేయాల్సిన సహాయం చేసేసిన తరువాత రాహుల్ వచ్చి ఏం చేస్తాడని బాబు ప్రశ్నించడం ఆయన హోదాకు సరికాదని రఘువీరారెడ్డి అన్నారు. రాహుల్ చిన్నప్పుడే అనేక కష్టాలను చవిచూశారన్నారు.  తుపాను సహాయంలో జరిగిన వైఫల్యాలపై తాను కొన్ని ప్రశ్నలను చంద్రబాబుకు పంపాను, అవి నిజం అయితే, సరిచేసుకోండని రఘువీరా విజ్ఞప్తి చేశారు. సిఎం సహనాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎంపి చిరంజీవి మాట్లాడుతూ చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నా, అనుకున్న స్థాయిలో ప్రజలకు సాయం అందడం లేదన్నారు. తుపాను నష్టం 60 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసిన చంద్రబాబు కేవలం 2000 కోట్ల రూపాయల సహాయానే్న కేంద్రాన్ని కోరడం సరికాదని అన్నారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సోమవారం నేతలు నాయకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: