తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు కనిపిస్తే చాలు మీడియా మిత్రులకు పండుగే. ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్ చేసి ఆయన వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఆయన బాడీ లాంగ్వేజ్.. మాట తీరు.. అచ్చమైన తెలంగాణ యాస ఆసక్తికరంగా ఉంటాయి. అది కాదుర భయ్.. అట్ల కాదు.. గిదేందర భయ్.. అంటూ.. క్యాజువల్ గా మాట్లాడుతూనే డైనమేట్లు పేల్చడం వీహెచ్ నైజం. అలాంటి వీహెచ్ శనివారం అనుకోకుండా విశాఖలో ప్రత్యక్షమయ్యారు. అలవాటుగానే వీహెచ్ ముందు మైకు పెట్టిన మీడియా మిత్రులను నిరాశపరచకుండా ఆయన కూడా వార్తకు పనికొచ్చే వ్యాఖ్యలే చేశారు. తుపాను సందర్భంగా చంద్రబాబు పనితీరు బావుందని మెచ్చుకున్నారు. చంద్రబాబు ముందుగా ప్రజలను అప్రమత్తం చేసి... ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా కాపాడారని ప్రశంసించారు. అలాగే తుపానుతో పాటు వర్షం లేకపోవడం వల్ల... పెద్ద ఇబ్బంది తప్పిందని సెలవిచ్చారు. బాబు బాగా పనిచేయడానికి వర్షం లేకపోవడం కూడా ఓ కారణం అనే అంతరార్థం వచ్చేలా మాట్లాడారు. ఇంతకీ వీహెచ్ విశాఖ ఎందుకొచ్చారంటే.. రాహల్ గాంధీ ఈ నగరానికి రానున్నందువల్ల ఆ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఆయన అక్కడికొచ్చారు. రాహుల్ గాంధీకి విశాఖలో ఏం పని.. రాహుల్ వచ్చి ఏం చూస్తారు.. ఏం చేస్తారంటూ చంద్రబాబు రెండు రోజుల నుంచి వెటకారంగా మాట్లాడటం తనను బాధించిందని వీహెచ్ చెప్పుకొచ్చారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు ఏ రాజకీయ నేతైనా వస్తారని.. రాహుల్ విషయంలో చంద్రబాబు అలా మాట్లాడటం తగదని మెత్తగా క్లాస్ పీకారు. చంద్రబాబు ఉత్తరాఖండ్ వరదల సమయంలో చంద్రబాబు అక్కడ పర్యటించి బాధితులను పరామర్శించారని.. మరి అలాంటప్పుడు రాహుల్ విశాఖ రావడంలో తప్పేముందుని లాజిక్కుతో కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: