కొన్నాళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో చిక్కు వచ్చిపడింది. శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదలకు సంబంధించిన వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీస్తోంది. ప్రస్తుతం ఈ జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు నీరు వదలుతున్నారు. దీనివల్ల.. విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఐతే... శ్రీశైలం నుంచి ఇక నీరు విడుదల ఆపాలని..లేకపోతే.. వేసవి కాలంలో రాయలసీమకు తాగునీరు ఉండదని ఏపీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగని.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ఆపేస్తే.. అసలే కరెంటు ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణకు మరింత ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి రోజూ దాదాపు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అందుకే నీటి విడుదల ఆపేసేందుకు తెలంగాణ సుముఖంగా లేదు. ఈ విషయంపై ఎలా ముందుకెళ్లాలో అర్థంకాక రెండు రాష్ట్రాలు జుట్టుపీక్కుంటున్నాయి. ఏపీ మంత్రి ఉమామహేశ్వరరావు.. ఈ విషయం గురించి తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో మాట్లాడనని చెబుతున్నారు. మరోవైపు హరీశ్ రావు మాత్రం తనతో ఏ ఏపీ మంత్రి మాట్లాడలేదంటున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. నీటివిడుదలతో శనివారం నాటికి అది... 862అడుగులకు పడిపోయింది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదల తగ్గించాలని నంద్యాల ఎంపీ ఏపీ అధికారులను కోరారు. ఇప్పుడు విడుదల చేస్తే వేసవిలో కనీసం తాగునీరు కూడా దొరకదని ఆయన భయపడుతున్నారు. ఏపీ సర్కారు విజ్ఞప్తిపై తెలంగాణ ఇంధన శాఖ చర్చలు జరిపింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిపేస్తే.. తెలంగాణలో విద్యుత్ కోతలు మరింత ఎక్కువవుతాయని తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో వెయ్యి మెగావాట్ల కొరత ఉందంటున్న అధికారులు.. ఎంత డబ్బు పెట్టి కొందామన్న బయట విద్యుత్ లభ్యత లేదని తెలంగాణ సర్కారుకు తెలిపారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే.. పాముకు కోపం.. మరి ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: