అన్నా హజారే.. అచ్చు భారత జాతిపిత మహాత్మా గాంధీ మరో అవతారంగా కొందరు భారతీయలు భావించే నాయకుడు. ఇప్పుడంటే కాస్త సైలంట్ గా ఉన్నాడు కానీ.. రెండేళ్ల క్రితం దేశమంతా అన్నా నామస్మరణతో ఊగిపోయింది. ఏరోజు పత్రిక చూసినా.. ఛానల్ పెట్టినా అన్నా వార్తలే దర్శనమిచ్చాయి. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే సాగించిన పోరు... చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. కేంద్రం లోక్ పాల్ బిల్లు పార్లమెంటులో పెట్టడం.. వయో భారం.. చెప్పుకోదగ్గ టీమ్ లేకపోవడం కారణంగా అన్నా హజారే కొన్నాళ్లుగా మౌనంగానే ఉంటున్నారు. నల్లధనంపై ఎన్డీఏ సర్కారు ఇచ్చిన మాట తప్పే పరిస్థితులు కనిపించడంతో అన్నా హజారే మరోసారి గళం విప్పారు. మోడీ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని మహారాష్ట్రలోని షిర్టీలో అన్నారు. అప్పట్లో అధికారం ఇచ్చిన వందరోజుల్లోనే నల్లధనాన్ని వెనక్కి తెస్తామని మోడీ చెప్పిన విషయాన్ని అన్నా గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు కావస్తున్నా.. మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న హజారే.. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కనీసం నల్లధనం దాచుకున్న వారి పేర్లు బయటపెట్టే సాహసం కూడా మోడీ చేయలేకపోతున్నారని అన్నా దుయ్యబట్టారు. నల్లధనం వెలికితీయడం కోసం ఉద్యమానలు తప్పవన్న అన్నా హెచ్చరిక ఆసక్తికలిగిస్తోంది. మరోసారి అన్నా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు. మరికొందరు ఉద్యమానికి ఇది సమయం కాదని వాదిస్తున్నారు. మోడీ సర్కారు వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయ్యిందని.. కనీసం ఇంకో ఏడాది తర్వాతే ఎలాంటి ఉద్యమం చేసినా విజయవంతమవుతాయని వారు విశ్లేషిస్తున్నారు. మరి అన్నా మరోసారి రంగంలోకి దూకుతారా.. లేక.. లేటు వయసులో ఎందుకొచ్చిన తిప్పలులే అని ప్రకటనలకే పరిమితమవుతారా.. వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: