గ్రూపు రాజకీయాల పురిటి గడ్డ.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు శంఖారావం పూరించారు. శోభానాగిరెడ్డి సెంటిమెంట్‌తో వైసీపీ బరిలోకి దిగుతుండగా.. ఒక్క ఛాన్స్‌ అంటూ కాంగ్రెస్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక కొడితే ఆళ్లగడ్డనే కొట్టాలంటూ టీడీపీ ఎత్తులు వేస్తోంది. వెరసి ఆళ్లగడ్డ ఉప సమరంపై రాష్ట్ర రాజకీయం దృష్టిసారించింది. రాష్ట్ర రాజకీయాల దృష్టంతా ఇప్పుడు ఆళ్లగడ్డ బై ఎలక్షన్స్‌పై పడింది. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆళ్లగడ్డ.. వైసీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి మరణంతో ఉపఎన్నిక హడావుడిలో ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున భూమా నాగిరెడ్డి పెద్ద కూతురు అఖిల ప్రియ నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. పోటీ లేకుండా ఏకగ్రీవ ఎన్నికకు పార్టీలు సహకరించాలని కోరారు. నందిగామలో వైసిపి పోటీ చేయలేదు కాబట్టి.. ఆళ్లగడ్డలో టీడీపీ పోటీ విరమించుకోవాలని కోరారు. మరోవైపు అధికార టిడీపీ కూడా ఉప సమరానికి సిద్ధమవుతోంది. అయితే అభ్యర్థి ఎవరనేది అధినేత గానీ, తమ్ముళ్లు గాని బహిర్గతం చేయలేదు. జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు హైదరాబాద్ వెళ్లి.. లోకేష్‌ సమక్షంలో అభ్యర్థిని ప్రకటించేలా ప్రణాళిక రూపొందిచారు. అయితే గంగుల ప్రభాకర్ రెడ్డికే దాదాపు టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని టీడీపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఉప సమరానికి సై అంటోంది. ఒక్క ఛాన్స్‌ అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విశాఖ తుపాన్ బాధితుల పరామర్శ అనంతరం రెండు రోజుల్లో అభ్యర్థి ఎంపిక ఉంటుందని జిల్లా నాయకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ అభ్యర్థి అఖిల ప్రియ నామినేషన్‌తో ఆళ్లగడ్డ రాజకీయం వేడెక్కింది. శోభానాగిరెడ్డి సెంటిమెంట్‌తో నెట్టుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నా.. టీడీపీ, కాంగ్రెస్‌లు పోటీకి దిగుతుండడంతో గెలుపు అవకాశాలు కష్టంగా మారాయి. ఇక టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైతే.. బైపోల్‌ పాలిటిక్స్‌ మరింత వేడెక్కనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: