సార్వత్రిక ఎన్నికల నాటి నుండి వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఊతమిచ్చేందుకు ముందుకురావాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై ఒత్తిడి పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రియాంక క్రియాశీల రాజకీయ ప్రవేశం కోసం డిమాండ్‌ చేశారు. తాజాగా మహారాష్ట్ర, హర్యానాల్లో ఘోరపరాజయం అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తలు ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయం వద్ద ప్రియాంక రాజకీయ ఆగమనం కోసం నినాదాలు చేశారు. ప్రియాంకగాంధీ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించాలని ఎఐసిసి కార్యాలయం వద్ద డిమాండ్‌ చేశారు. ఇలాంటి డిమాండ్లు పదేపదే వస్తూనే వున్నాయి. ప్రియాంక మాత్రం మౌనం వహిస్తున్నారు. ప్రియాంక రావాలి...కాంగ్రెస్‌ను బ్రతికించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దాదాపు 200 నుండి 250 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడ గుమికూడారు. అందులో ఎక్కువగా మహిళలే వుండటం గమనార్హం. తన సోదరిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి చొరవ తీసుకోవాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు. 'కాంగ్రెస్‌ కష్టకాలంలో వుంది. ఈ సమయంలో ప్రియాంకగాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం వుంది. రాహుల్‌ గాంధీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీతో పాటు ప్రియాంక వుంటేనే కాంగ్రెస్‌ బ్రతికిబట్టకట్ట గలదు. నరేంద్రమోడీ గాలిని తట్టుకుని నిలబడటానికి రాహుల్‌కు ప్రియాంక మరింత అండగా వుంటారు' అని పార్టీ కార్యాలయం వెలుపల ఒక కార్యకర్త పేర్కొన్నారు. ముందుగానే ప్రియాంకను తీసుకొచ్చి ప్రచారం చేయించి వుంటే మహారాష్ట్ర, హర్యానాల్లో పరిస్థితి మరోలా వుండేదని కొంతమంది వ్యాఖ్యానించారు. ఈ ముఠాకు ఐఎన్‌టియుసి నాయకుడు జగదీష్‌ శర్మ నాయకత్వం వహించారు. పార్టీ వరుసగా పరాజయాల పాలవుతోంది. ఈ సమయంలో ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వుంది. పార్టీ బాధ్యతలు ఆమె కూడా చేపట్టాలి. ప్రియాంక రాకతో పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడటానికి అవకావం వుంటుందని జగదీష్‌ శర్మ అన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ గాలి గురించి అందరూ మాట్లాడారు. రారుబరేలీ, అమేథీ లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు ప్రియాంక తీసుకోవడం ద్వారా అక్కడ పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ మోడీ ప్రభావం ఏమాత్రం కనిపించలేదని శర్మ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: