అధికార ఎఐఎడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత తన ప్రజాజీవితం అగ్నిగుండంలో ఈదుతున్నట్లుగా ఉందని తెలిపారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడి శనివారం జామీనుపై విడుదలయి ఇంటికి చేరుకున్న జయలలిత ఆదివారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ఇబ్బందులు తనకు గతంలోనూ కలిగాయని, ప్రజాజీవితంలో ఇలాంటి వాటిని ఎదుర్కొంటానని జయలలిత తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లను, సమస్యలను చూసి తాను ఆందోళన చెందడం లేదని, తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం సాగుతున్న తన పయనంలో ఇలాంటి వాటిని ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు. ‘నేను నా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. వాటి నుంచి విజయవంతంగా బయటపడ్డాను’ అని ఆమె పేర్కొన్నారు . తన కోసం ఎవరూ ఆత్మహత్యలకు పూనుకోవద్దని ఆమె తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకోవద్దని నేను ప్రేమతో కోరుతున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. తన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసిన అభిమానులకు జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ప్రార్థనల వల్లే తాను జైలునుంచి విడుదలయ్యానని ఆమె పేర్కొన్నారు. తాను ఎదుర్కొన్న సమస్యలను విని 193మంది చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఒక్కో కుటుంబానికి రూ. 3లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని జయలలిత ప్రకటించారు. అలాగే ఆత్మహత్యకు యత్నించిన ముగ్గురికి రూ. 50వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: