మరాఠాగడ్డపై బోణీ కొట్టిన మజ్లిస్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. మహారాష్ట్ర ప్రయోగాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని భావిస్తోంది. పాతబస్తీ వెలుపల తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు రుచి చూసిన మజ్లిస్.. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బెంగాల్లోనూ ఇకపై ఎన్నికల బరిలో దిగాలని వ్యూహాలు రచిస్తోంది. మొత్తంగా మైనారిటీలకు తానే దేశవ్యాప్త ప్రతినిధిగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో సాధించిన విజయం ఇచ్చిన ఉత్సాహంతో దేశవ్యాప్తంగా సత్తా చాటాలని యోచిస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన పార్టీగా ఎంఐఎంకు ముద్ర ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలలోనూ పలు చోట్ల మంచి ఫలితాలను ఎంఐఎం సాధించింది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీ కాలుమోపింది. ఇదే తరహా ప్రయోగం ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ చేయాలని ఎంఐఎం నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. దీంతో జాతీయ పార్టీగా తమ పార్టీకి గుర్తింపు తేవాలని యోచిస్తోంది. మున్ముందు లోక్‌సభ ఎన్నికలపైనా కూడా ప్రత్యేక దృష్టిసారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ విజయం వెనక ఎంఐఎం నాయకత్వం చేసిన కృషి ఎంతో ఉంది. అగ్రనేతలు అసదుద్దీన్‌ ఓవైసీ, అక్బరుద్దీన్‌ ఓవైసీ.. పలుమార్లు విస్తృతంగా పర్యటించారు. అక్కడ స్థానికంగా ఉన్న ముస్లింల విశ్వాసం గెలుచుకోవడంలో సఫలీకృతం అయ్యారు. ఇకపై ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో... ముస్లింలతో పాటు ఇతర వెనకబడిన వర్గాలను కూడా కలుపుకుని వెళ్లి ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు, నాలుగైదు సీట్లు వచ్చిన పార్టీలకు సైతం డిమాండ్‌ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో తమ పార్టీ చక్రం తిప్పవచ్చని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: