విజయవాడలో వాహనాల కొనుగోళ్ల జోరు పెరిగింది. భారీ సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నవ్యాంధ్ర రాష్ట్రానికి విజయవాడ నూతన రాజధానిగా ఆవిర్భవించడంతో.. నగరంలో వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పేరున్న బెజవాడకు.. ఆటో మొబైల్‌ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. 2, 3 ఏళ్ల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన పెను మార్పులతో విజయవాడ వాహనరంగం ఉక్కిరిబిక్కిరయింది. వరుస సమ్మెలు, నెలల తరబడి ఆందోళనలు.. వాహనాల అమ్మకాలు రిజిస్ట్రేషన్లను దెబ్బ తీసినట్లు ఇక్కడ ఆర్టీఓ అధికారులు చెప్పారు. సమైక్యాంధ్ర ఆందోళనలు సర్దుమణిగాక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్లు పెరిగాయయని అధికారులు తెలిపారు. కార్లు, బైక్‌ల విషయంలో బాగా వృద్ధి కనిపిస్తోందన్నారు. మరో 2 నెలల్లో కనీసం 5 వందల కార్లు, మరో 5 వేల బైక్‌ల రిజిస్ట్రేషన్‌ ఖాయమని అధికారులు తేల్చారు.  సమైక్య రాష్ట్రంలో విజయవాడవాసులు భారీగా హైదరాబాద్‌కు వెళ్తూ, కార్లు, బైక్‌లు కొని రిజిస్టర్‌ చేయించేవారు. ఈ సంఖ్య ఏడాదికి 800 కార్లు, 3 వేల బైక్‌లుగా ఉండేది. అయితే విభజన తరువాత జాగ్రత్తగా విజయవాడలోనే వాహనాలు.. కొని ఇక్కడే రిజిస్ట్రేషన్‌కు మొగ్గు చూపడం కొత్తగా వచ్చిన మార్పని అధికారులు అంటున్నారు. 4 లక్షలతో ప్రారంభమయ్యే కార్లు మధ్య తరగతిని ఆకర్షిస్తుండగా.. 10 లక్షల ఖరీదైన కార్లను సంపన్నులు ఎక్కువగా కొంటున్నారు. నగర పరిధిలో అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్లు బాగా పెరిగే అవకాశం ఉంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ఆదాయం మెరుగుపడింది. ముఖ్యంగా కార్లు, బైక్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడితే తప్ప.. ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీరేలా కనిపించడం లేదు. వాహనాలు పెరిగాయి కాబట్టి.. వెంటనే ఫ్లై ఓవర్లు కావాలని అధికారులు కోరుతున్నారు. అసలే బెజవాడలో ఇరుకు రోడ్లు ఉంటే రాజధాని ప్రకటనతో మరింత వాహనాలు పెరిగాయని, వెంటనే దుర్గగుడి వద్ద, బెంజ్‌ సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్లు నిర్మించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: