తెలంగాణ పరిధిలో ఏబీఎన్, టీవీ9 చానళ్లను ప్రసారం చేయడానికి తమకేం అభ్యంతరం లేదని... ప్రజలు కోరుకొంటే తాము ఆ చానళ్ల ప్రసారాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని అంటున్నాడు తెలంగాణ ఎమ్ఎస్ఓల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి!తాము వ్యక్తిగత కక్షతో కానీ, తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో కానీ ఆ చానళ్ల ప్రసారాలపై నిషేధాన్ని విధించలేదని ఆయన అంటున్నాడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, తెలంగాణ పౌరుల ఆత్మగౌరవాలను దెబ్బతీసినందుకే ఆ చానళ్ల ప్రసారాలపై నిషేధాన్ని విధించినట్టుగా ఆయన వివరించాడు. ఈ విషయంలో తమపై ప్రభుత్వ ఒత్తిడి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశాడు. ఆ చానళ్ల ప్రసారాలను ఆపి వేయాలని ముఖ్యమంత్రి తమకు చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించాడు. ఆ చానళ్ల యాజమాన్యాలు కోర్టుకు కూడా వెళ్లాయని. అయితే ఉన్నత న్యాయస్థానాలు కూడా తమకే అండగా నిలిచాయని... ఎమ్ఎస్ ఓల సంఘం అధ్యక్షుడు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా ప్రజలు కోరుకొంటే ఆ చానళ్లను ప్రసారం చేస్తామని..అయితే తెలంగాణ ప్రజలు ఆ చానళ్ల ప్రసారాలను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశాడు. మరి దీన్ని బట్టి తెలంగాణ ఎమ్ఎస్ ఓలు ఆ రెండు చానళ్ల ప్రసారాల విషయంలో ఇప్పుడప్పుడే వెనక్కు తగ్గేలా లేరని స్పష్టం అవుతోంది. మరి ప్రసారాల పునరుద్ధరణ విషయంలో ఆ చానళ్లకు మోక్షం ఎప్పుడో!

మరింత సమాచారం తెలుసుకోండి: