ఒకవైపు తమిళనాడులో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఆ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో ఒక ఎంపీ సీటును సాధించుకొన్న భారతీయ జనతాపార్టీ ప్రస్తుత పరిణామాల మధ్య బలపడే ప్రయత్నాలు చేస్తోంది. జయలలిత అవినీతి కేసులో దోషిగా తేలడం, డీఎంకే పరిస్థితి ఏమీ బాగోలేకపోవడంతో తాము బలపడటానికి ఇదే తగిన తరుణం అని భారతీయ జనతా పార్టీ లెక్కలేసుకొంటోంది. స్వయంగా భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమిళనాడుపై దృష్టి సారించారని... ఇక్కడ తమ పార్టీని బలోపేతం చేసే వ్యూహాలను ఆయన రచిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఆయన ప్రయత్నాలు అలా ఉంటే.. తమిళనాడుకే చెందిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి మాత్రం పార్టీకి కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాడు. తన మాటలతో ఆయన పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేకి భారతరత్న బిరుదు ఇవ్వాలని సుబ్రమణ్య స్వామి అంటున్నాడు. అనడమే కాదు.. ఈ డిమాండ్ తో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఒక లెటర్ కూడా రాశాడు స్వామి! ఇది తమిళులకు సహజంగానే కోపం తెప్పించే పరిణామమే. మహేంద్ర రాజపక్సే ఎల్టీటీఈ ఉద్యమాన్ని అణిచివేశాడని.. తద్వారా భారత్ కు కూడా కొంత ఉగ్ర ముప్పును నిరోధించాడని స్వామి అంటున్నాడు. కాబట్టి మహేంద్రకు భారతరత్న బిరుదు ఇవ్వాలని కోరుతున్నాడు. మరి చాలా మంది తమిళులు ఎల్టీటీఈకి ఫ్యాన్స్. శ్రీలంకలో తమ ఉనికిని చాటిన తమిళ టైగర్లు అంటే తమిళనాడులో తగని ఆదరణ. ఇటువంటి నేపథ్యంలో స్వామి ఈ విధంగా ప్రకటన చేయడం, తమిళులను అణిచివేసిన శ్రీలంక అధ్యక్షుడికి భారతరత్న ఇవ్వాలని అనడం. .వివాదంగా మారే అవకాశం ఉంది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి స్వామి తలనొప్పి తెచ్చిపెట్టాడు.ఆ పార్టీ దీన్ని ఎలా పరిష్కరించుకొంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: