తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బాధితుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 8 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని మారుమూల గ్రామాలలోకి కూడా వెళ్లి ప్రజలు పడుతున్న బాధలను ఆయన దగ్గరగా చూస్తున్నారు. భారీగా నష్టపోయిన మత్స్యకారులను, పేదలను, వృద్ధులను అందరినీ పరామర్శిస్తున్నారు. దెబ్బతిన్న పడవలను, వలలను చూశారు. నీట మునిగిన పొలాలను చూశారు. కూలిపోయిన ఇళ్లను చూశారు. తుపాను వల్ల సర్వం కోల్పోయి ప్రభుత్వ సహాయం అందక బాధితులు పడుతున్న కష్టాలను చూసి జగన్ చలించిపోయారు. అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయం అందేవిధంగా ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఫైబర్‌ బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు 2 లక్షల 50వేల రూపాయలు, వలలు కోల్పోయిన వారికి 50వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. కొబ్బరితోటలు కోల్పోయిన వారికి చెట్టుకు 5 వేలు పరిహారం డిమాండ్‌ చేశారు. జీడిమామిడి తోటలకు ఎకరాకు 50 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి బాధితుని ఇంటికి తక్షణ సాయంగా 5 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు. తుపాను బాధితులకు 25 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వాసితులకు అందించే సాయం ఇదేనా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులు, మత్స్యకారులకు వచ్చే నెల 5వ తేదీలోగా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులు, డ్వాక్రా మహిళలు ఈ ముట్టడిలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. YS Jagan, North andhra, moodby, వైఎస్ జగన్, ఉత్తరాంధ్ర, చలించిపోయారు

మరింత సమాచారం తెలుసుకోండి: