ఏదైనా రాష్ట్రంలో సంకీర్ణ సర్కారు ఏర్పడితే.. అతిపెద్ద పార్టీ ఇతర పార్టీల మద్దతు కోసం తహతహలాడుతుంది. ఏదోలా చేసి.. ఇతర పార్టీల మద్దతు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంది. చిన్నాచితకా పార్టీలను దువ్వుతుంది. ఇండిపెండెంట్లకు మంత్రి పదవులు ఎరవేస్తుంది. ఎన్నిరకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తుంది. కానీ మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అదికారపగ్గాలు అందుకునేందుకు ఇంకా.. పాతిక వరకూ సీట్లు అవసరం ఉన్నా.. ఆ పార్టీ చాలా కూల్ గా ఉంది. అడగకుండానే మద్దతిచ్చేందుకు సిద్దమంటూ ఎన్సీపీ ముందుకొచ్చేసింది. వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేయొచ్చు. అలాగే పాత మిత్రుడు శివసేన కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమనే తరహాలో సంకేతాలు పంపుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలా అన్న అంశంపైనే బీజేపీ అగ్రనేతలు మల్లగుల్లాలుపడుతున్నారు. తాజా పరిణామాలు గమనిస్తే రెండు మూడు రోజులుగా ఇన్నాళ్లూ శివసేన మద్దతుపై ఎటూతేల్చని బీజేపీ.. తాజాగా పాత మిత్రుడితో మళ్లీ చేతులు కలపడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలిస్తున్నది. ఎన్సీపీ ఇచ్చిన బేషరతు మద్దతు ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించకూడదనుకుంటూనే సేనతో దోస్తీకి సై అంటోంది. అటు శివసేన కూడా బీజేపీ పెద్దలతో చర్చలు జరపడానికి ఇద్దరు ప్రతినిధులను ఢిల్లీకి పంపింది. రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్, సీనియర్ నేత సుభాష్ దేశాయ్ మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఎవరి మద్దతు తీసుకోవాలన్న అంశంపై బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయకపోయినా.. ఆ పార్టీ శివసేనవైపు మొగ్గుచూపుతున్నట్లు అరుణ్‌జైట్లీ సంకేతాలిచ్చారు. శివసేనను తమ సహజ మిత్రుడిగా పేర్కొన్న ఆయన.. ఉద్ధవ్ ప్రధానికి ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పడం మద్దతుపై పరోక్షంగా సంకేతాలిచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: