మరి చివరి వరకూ పోటీకి మొగ్గు చూపుతుందని అనుకొన్న తెలుగుదేశం వెనుకడుగు వేసింది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల ఏకగ్రీవంగా ఉండదు.. ఇక్కడ పోలింగ్ తప్పదు.. అనుకొంటున్న తరుణంలో తాము పోటీ చేయడం లేదని తెలుగుదేశం స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ కూడా పోటీ ఉద్దేశం లేదని చెప్పింది. దీంతో ఇక ఈ నియోజకవర్గం ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే అనుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ తెలుగుదేశంలతో పాటు బీజేపీ, ఎమ్ఐఎమ్, సీపీఐ, సీపీఎంలు కూడా పోటీకి ఆసక్తి చూపలేదు. మరి ఇలా గుర్తింపు ఉన్న పార్టీలన్నీ పోటీ చేయడం లేదని ప్రకటించడంతో ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ ఏకగ్రీవ ఎన్నికకు కొన్ని అడ్డంకులున్నాయి! ఇండిపెండెంట్ల రూపంలో దాఖలు అయిన నామినేషన్లు ఏకగ్రీవ ఎన్నికకు అడ్డంకిగా మారుతున్నాయి. కొంతమంది ఔత్సాహికులు ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్లు వేసినట్టు సమాచారం. ప్రధాన పార్టీలు ఎన్నికలకు దూరంగా నిలబడాలని నిర్ణయించినా.. కొంతమంది మాత్రం నామినేషన్లు వేసి తమ ముచ్చట తీర్చుకొన్నారు. మరి వారు విత్ డ్రా చేస్తేనే భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. ఇక విత్ డ్రాలకు సమయం వచ్చింది. మరి ఈ విషయంలో భూమా ఫ్యామిలీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటేనే వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: