శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కారణంగా రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎగువన ఉన్న రాయలసీమ రైతుల ప్రయోజనాలు పట్టించుకోకుండా, నిబంధనలు పాటించకుండా విద్యుత్ ఉత్పత్తి పేర దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ప్రతి ఏటా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి సాకుతో దిగువకు నీటి విడుదలలో యథేశ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాయలసీమ నీటి అవసరాలు సంపూర్ణంగా తీరాలంటే సప్తనదుల సంగమ స్థలంలో సిద్ధేశ్వరం ఆనకట్ల నిర్మాణమొక్కటే మార్గమని విశే్లషకులు పేర్కొంటున్నారు. కృష్ణాజలాల్లో బచావత్ అవార్డు ప్రకారం 811 టిఎంసిలు, బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 1005 టిఎంసిల నీరు కేటాయించారని సాగునీటి రంగం నిపుణులు వెల్లడిస్తున్నారు. తాజాగా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 1005 టిఎంసిల్లో 150 టిఎంసిల మిగులు జలాలను క్యారీ ఓవర్‌గా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ ఉంచాలి. అందులో శ్రీశైలంలో 60, నాగార్జునసాగర్‌లో 90 టిఎంసిల నీరు తప్పనిసరిగా నిల్వ చేయాలి. ఆనీటిని తరువాతి సంవత్సరం ఖరీఫ్‌లో నారుమళ్లకు వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 861 అడుగులు, నాగార్జునసాగర్ నీటిమట్టం 510 అడుగుల వద్ద దిగువకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు విడుదల చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తరువాత సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో నీటిని వ్యవసాయ వినియోగానికి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అంతేగాక శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని మొదటి ప్రాధాన్యత కింద సాగునీటి రంగానికి వినియోగించాలే తప్ప విద్యుత్ ఉత్పత్తికి కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇక క్యారీ ఓవర్‌గా నిల్వ ఉంచాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించరాదన్న విషయాన్ని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో స్పష్టంగా వెల్లడించారని గుర్తు చేస్తున్నారు. అంతేగాక రాయలసీమ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం జలాశయం నీటిమట్టం 834 అడుగులకు చేరగానే దిగువకు నీరు విడుదల చేయవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గతంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు, నిబంధనలు నాటి ఉమ్మడి ప్రభుత్వం, నేటి తెలంగాణ ప్రభుత్వం పాటించకపోవడం రాయలసీమకు తీరని నష్టం చేకూరుతోంది. మరో వైపు తెలంగాణ విద్యుత్ కొరత తీర్చేందుకు 300 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం మొండిగా విద్యుత్ ఉత్పత్తి చేయడంపై సీమప్రజలు మండిపడుతున్నారు. మున్ముందు ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే క్యారీ ఓవర్‌గా కేటాయించిన 60 టిఎంసిల మిగులు జలాలను నిల్వ ఉంచుకోవడానికి సిద్ధేశ్వరం ఆనకట్ట నిర్మాణం తప్పనిసరని సాగునీటి రంగం నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిర్మాణం తక్షణం చేపట్టేలా రాయలసీమ ప్రజాప్రతినిధులు రాజకీయాలకతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని వారు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: