హుదూద్ తుఫాన్ వల్ల అపారనష్టం వాటిల్లి జనం ఇబ్బంది పడుతుంటే కనీస సహకారం కూడా ప్రభుత్వం అందించలేదని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలు, రూరల్, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడంలో సిఎం, మంత్రులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. 25 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నెలవారీ ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటికీ తెల్లకార్డుదారులకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.  తుఫాన్ సహాయాన్ని పార్టీ కార్యకర్తల పర్యవేక్షణలో బాధితులకు అందించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక కార్యకలాపాలను నిరసిస్తూ అన్ని మండలకేంద్రాల్లో నవంబర్ 5న అన్ని తహశీల్దార్ కార్యాలయాల వద్ద వైకాపా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. బాధితులకు సాయమందేవరకూ వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టంచేశారు. రుణమాఫీ మాట ఎలా ఉన్నా.. కనీసం రుణాల రీషెడ్యూల్ జరుపలేకపోయారని, నష్టపోయిన పంటలకు బీమా అందించలేకపోయారని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారన్నారు. ప్రతి నెలా 700 కోట్ల రూపాయలు పింఛనుదారులకు అందిచాల్సి ఉండగా వార్షిక బడ్జెట్‌లో కేవలం 1300 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని పరిశీలిస్తే,,్భవిష్యత్‌లో కూడా మరింత మంది పింఛన్లు తొలగించేందుకు సర్కార్ యోచిస్తున్నట్లు అర్ధమవుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: