మరి ఇప్పటి వరకూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎవరికైనా ఈ ఐడియా వచ్చిందో లేదో కానీ... తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత వీ హనుమంతరావుకు మాత్రం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఎలా కాపాడుకోవాలో.. ఆ ప్రాంతంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయడానికి మాత్రం మంచి మంచి ఐడియాలే వస్తున్నాయి. ఈ మేరకు ఆయన తన ఆలోచనలను మీడియాతో కూడా పంచుకొన్నాడు. పార్టీని వీడిపోయిన కాంగ్రెస్ నేతలను తిరిగి చేర్చుకోవాలనేది వీ హనుమంత రావు ఐడియా. తద్వారా పార్టీని బలోపేతం చేయవచ్చని తిరిగి ఉనికిని చాటవచ్చని ఈయన అంటున్నాడు. సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్ , హర్షకుమార్ వంటి నేతలను తిరిగి చేర్చుకోవాలని వీహెచ్ అంటున్నాడు. ఇలా ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి వెళ్లిన నేతలను అందరినీ చేర్చుకోవాలని... పార్టీని తిరిగి పట్టాలెక్కించాలని వీహెచ్ అభిప్రాయపడుతున్నాడు. ఈ మేరకు వాళ్లందరితోనూ తాను మాట్లాడినట్టుగా కూడా వీహెచ్ వివరించాడు. కాంగ్రెస్ ను వీడి వెళ్లిన నేతలతో తాను మాట్లాడానని.. వారందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించానని వీహెచ్ వివరించాడు. అయితే ఇలా అందరూ పార్టీలోకి తిరిగి వచ్చినా ఒక్కరు మాత్రం కాంగ్రెస్ లోకి తిరిగి అడుగుపెట్టడానికి వీలు లేదని వీహెచ్ స్పష్టం చేశాడు. అదెవరో కాదు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన వల్లనే పార్టీ ఇంతలా నాశనం అయ్యిందని.. కాబట్టి ఆయన తిరిగి పార్టీలోకి రావడానికి వీలు లేదని వీహెచ్ స్పష్టం చేశాడు. అయితే వీహెచ్ భ్రమ కానీ.. కిరణ్ మళ్లీ కాంగ్రెస్ లోకి ఎందుకు వస్తాడు?! కిరణ్ మాత్రమే కాదు.. వీహెచ్ ఆహ్వానించిన వాళ్లెవ్వరూ కూడా తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు లేవు. అయినా ఈ తెలంగాణ నేతకు ఇక్కడ పార్టీ పరిస్థితి గురించి ఆలోచించకుండా ఏపీ వ్యవహారాలతో పనేంటో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: