ఉత్తరాంధ్ర రైతులు నిలువునా మునిగిపోయారు. హుదూద్ తుపానుకు ఉత్తరాంధ్రలోని దాదాపూ అన్ని పంటలు దెబ్బ తిన్నాయి. సాధారణంగా పంట నష్టం వాటిల్లితే, నష్ట పరిహారం చెల్లించడానికి ఆయా బీమా కంపెనీలు చట్టంలో ఉన్న అనేక లొసుగులు చూపించి, రైతులకు చిల్లి గవ్వ కూడా చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. హుదూద్ తుపాను సందర్భంగా పంట నష్టపోయిన రైతులకు క్రాప్ బీమా వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ వారికి చిల్లి గవ్వ కూడా నష్ట పరిహారం కింద అందే అవకాశాల్లేవు. ఎందుకంటే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదు. ప్రీమియం చెల్లించినా, నష్ట పరిహారాన్ని ఇవ్వడానికి ససేమిరా అనే బీమా కంపెనీలు, రైతులు ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాయి బీమా కంపెనీలు. దీంతో ఉత్తరాంధ్రలోని సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులకు పంట నష్టం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితికి చంద్రబాబు ఇచ్చిన రుణ మాఫీ నినాదమే అంటున్నాయి బీమా కంపెనీలు, బ్యాంకులు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తను అధికారంలోకి వస్తే, రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చాక రుణ మాఫీకి అనేక నిబంధనలు, షరతులు విధిస్తూ వచ్చారు. ఇప్పటికీ రుణ మాఫీ ఒక కొలిక్కి రాని సంగతి తెలిసిందే. చంద్రబాబు హామీతో రైతులెవరూ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాక మునుపే ఖరీప్ సీజన్ ఆరంభమైంది. మార్చి నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఖరీఫ్ సీజన్. అప్పటి వరకే బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేస్తాయి. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రైతులు తాము తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో, కొత్త రుణాలు ఇవ్వడానికి ఏ బ్యాంకూ ముందుకు రాలేదు. రుణాలను రీషెడ్యూల్ కూడా చేయించుకోలేదు. రీ షెడ్యూల్ చేయించుకుంటే, రుణ మాఫీ వర్తించదన్న భావనతో రైతులు ఈ పని కూడా చేయలేదు. కేవలం ఐదు నుంచి 10 శాతం మంది మాత్రమే తీసుకున్న రుణాన్ని చెల్లించి, కొత్త రుణాలు తీసుకున్నారు. ఒక్క విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలోనే సుమారు 88 వేల మంది రైతులకు 210 కోట్ల రూపాయల వరకూ రుణ మాఫీ వర్తిస్తుందని ప్రతిపాదనలు తయారు చేసి పంపించింది. అలాగే ఈ ఖరీఫ్‌లో 160 కోట్ల రూపాయల కొత్త రుణాలు ఇవ్వాలని భావించింది. (అదీ కూడా రైతులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తేనే) రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు కేవలం 10 కోట్ల రూపాయల వరకూ కొత్త రుణాలు ఇచ్చి చేతులు దులుపుకొంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో డిసిసిబిల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉంది. ఈ ప్రాంతల్లో 46 బ్యాంకులు పంట రుణాలు ఇస్తుంటాయి. ఉత్తరాంధ్రలోని డిసిసిబిల్లోనే సుమారు మూడు లక్షల మంది రైతులు ఉంటే, ఇక మిగిలిన బ్యాంకులన్నీటిలో కలిపి ఐదు నుంచి ఆరు లక్షల వరకూ రైతులు ఉంటారని తెలుస్తోంది. ఈ ఖరీఫ్‌లో బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు ప్రైవేటుగా అప్పులు తెచ్చుకుని పంటలు వేసుకున్నారు. ఈ పంటలన్నింటినీ హుదూద్ తుపాను పొట్టనపెట్టుకుంది. పంట నష్టపోయిన రైతులకు చిల్లి గవ్వకూడా బీమా వచ్చే అవకాశం లేదని బ్యాంకు అధికారులు, బీమా సంస్థలు చెపుతున్నాయి. ఖరీఫ్‌లో కొత్త రుణాలు తీసుకుని, వాటి నుంచి ప్రీమియం మొత్తాన్ని బీమా కంపెనీలకు చెల్లించిన రైతులకే పరిహారం వస్తుందని చెపుతున్నారు. మాఫీ కోసం చూసి, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడం, కొత్త రుణాలు తీసుకోపోవడం, ప్రీమియం చెల్లించకపోవడం వలన ఉత్తరాంధ్రలోని రైతులకు పంట నష్టం అందదు. దీంతో లక్షలాది మంది రైతులు నిలువునా మునిగినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: