తెలంగాణలో టీఆర్ఎస్ - తెలుగుదేశం మధ్య మాటలయుద్ధం ముదురుతోంది.. రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు.. వివాదాస్పదమవుతోంది. తెలంగాణలో ఉనికి కాపాడుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే.. అసలు ఆ పార్టీనే లేకుండా చేయాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. వలసలు ప్రోత్సహించడం.. తెలంగాణ వ్యతిరేక ముద్ర వేయడం వంటి చర్యల ద్వారా టీడీపీని ఈ ప్రాంతంలో లేకుండా చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ఘర్షణలో రెండు రాజకీయ పక్షాల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో ఫైరవుతోంది. మేం తలచుకుంటే టీఆర్ఎస్ భవన్ లో ఇటుక పెల్ల లేకుండా చేస్తామని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్ .. ఏకంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్నే రాత్రికి రాత్రి నేలమట్టం చేస్తామని హెచ్చరించింది. టీడీపీ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం మాని.. చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. చంద్రబాబు తన రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకోవాలి కానీ తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని టీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి విమర్సించారు. ఒకపక్క తెలంగాణకు రావాల్సిన 54 శాతం కరెంటు రాకుండా అడ్డుకుంటున్నాడు.. మరోపక్క తెలంగాణలో టీటీడీపీ నేతలతో బస్సుయాత్రలు చేయిస్తున్నాడు. ఇంకోపక్క శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరుతూ కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖ రాశాడు. ఇదేనా చంద్రబాబుకున్న ముందుచూపు? అంటూ టీఆర్ఎస్ నేతలు చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ముందుచూపు లేదని చెప్పడానికి అసలు ఆయనెవరు? అని ప్రశ్నించారు. మేం ఎవరి జోలికీ వెళ్లబోం.. మా జోలికొస్తే ఊరుకోం అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: