ఉత్తరాంధ్రను వణికించిన హుదుద్ తుపాను నేపథ్యంలో కాస్త పెండింగ్ లో పడిన కొత్త రాజధాని పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతం సరిహద్దులు గుర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా.. కొత్త రాజధాని నిర్మాణానికి ప్రాజెక్టు సలహాలు, నిర్వహణల సంప్రదింపుల సంస్థను ఎంపిక చేసేందుకు సర్కారు పని ప్రారంభించింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో బిడ్లను ఆహ్వానించింది. ఇంటర్నేషనల్ ప్రోఫెషనల్ మేనేజ్ మెంట్ సంప్రదింపుల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ ప్రెస్ నోటీస్ రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్టు సలహాలు, నిర్వహణల సంప్రదింపుల సంస్థ.. షార్ట్ కట్లో పీఏఎంసీ గా వ్యవహరించే ఈ సంస్థ.. రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించనుంది. కొత్త రాజధాని మాస్టర్ ప్లాన్ ను ఈ సంస్థే రూపొందిస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తుమ మోడల్ ను రూపొందించాల్సిన బృహత్తర బాధ్యత ఈ సంస్థపై ఉంటుంది. అందుకే ఎక్కడా రాజీపడకుండా.. అవినీతి ఆస్కారం లేకుండా అంతర్జాతీయ స్థాయి బిడ్లను ఆహ్వానించారు. అత్యుత్తమ పట్టణ ప్రణాళిక రూపొందించడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం, చక్కటి రవాణా సౌకర్యాలు కల్పించడం.. వంటివి ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. ఈ పీఏఎంసీ సంస్థ కోసం పత్రికాప్రకటన విడుదల చేసిన సమయంలోనే... జపాన్ ప్రతినిధులు కూడా సాంకేతిక సహకారం అందిస్తామంటూ ముందుకు రావడం శుభసూచికమే. అయితే.. ఇల్లలకగానే పండుగ కాదన్న సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముందు రాజధాని విషయంలో సర్కారును ఇబ్బంది పెడుతున్న అంశం భూసేకరణ. దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీ ద్వారా సులభంగా భూసేకరణ సాధ్యమేనని సర్కారు భావిస్తోంది. అది అంత సులభం కాదన్న విషయం క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్న వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: