శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన విద్యుత్ వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రత్యామ్నాయం చూపే వరకు ఉత్పత్తిని ఆపేదిలేదని నిశ్చయించుకుంది. ఒకవేళ 300 మెగావాట్ల విద్యుత్‌ను ఇచ్చేందుకు ఏపీ ముందుకు వస్తే, ఆ మేర ఉత్పత్తిని తగ్గించుకునేందుకు సిద్ధమని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రానికి రావాల్సిన మొత్తం 700 మెగావాట్ల విద్యుత్ ఇచ్చే వరకు శ్రీశైలంలో నీటి వాడకాన్ని కొనసాగించి తీరతామని స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుకు తెలియజేస్తూ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం మరో లేఖ రాసింది. దీంతో ఈ విషయంలో ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదని కృష్ణా బోర్డు కూడా నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగంపై నియంత్రణ, నీటిమట్టాల పర్యవేక్షణ, వివరాల పరిశీలన విషయంలో జాప్యం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం తప్ప మరో మార్గం లేదనే భావనకు వచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ర్ట ప్రభుత్వం కూడా వెంటనే స్పందించిృధీటైన సమాధానమిచ్చింది. రాష్ర్ట ప్రభుత్వం ఎక్కడా నిబంధనలను ఉల్లఘించలేదని పేర్కొంటూ, సంబంధిత వివరాలను గణాంకాలతో సహా ఉటంకిస్తూ కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ ఆర్.కె.గుప్తాకు రాష్ర్ట నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ తాజా లేఖ రాశారు. ఏపీ నుంచి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన విద్యుత్ వాటా దక్కనందువల్లే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. జలాశయం నీటి వినియోగం విషయంలో తాగు, సాగు అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆంధ్రా సర్కారు అభియోగం ఎంతమాత్రం సరికాదని రాష్ర్ట ప్రభుత్వం తరఫున వివరించారు. ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌కు 60.17 టీఎంసీలు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 5.37 టీఎంసీలు, కల్వకుర్తి ఎల్‌ఐఎస్‌కు 0.262 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు గణాంకాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతంలోని రైతులు ప్రధానంగా కరెంటు పంప్‌సెట్లపై ఆధారపడి సాగు చేస్తున్నారని, ఆ పంటలను కాపాడేందుకే శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, గతంలో ఉన్న ఉత్తర్వుల ప్రకారం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, చెన్నై తాగునీటి అవసరాలకు 34 టీఎంసీల నీటిని వాడుకోవాలి. కానీ గత నాలుగు నెలల్లోనే కోటాను మించి నీటిని వాడుకున్నట్లుగా గణాంకాల ద్వారా తెలుస్తోంది. వరద ఉన్న సమయంలోనే నిర్ణీత కోటాను వాడుకోవాల్సి ఉందని.. ఈసారి వరద లేకున్నా అంతకంటే ఎక్కువ నీటిని ఏపీ వినియోగించుకున్న విషయాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఎత్తి చూపింది. దీంతో శ్రీశైలంలో నీటి వాడకాన్ని కొనసాగిస్తే రాయలసీమ తాగునీరు ప్రయోజనాలు దెబ్బతింటాయంటున్న ఏపీ ప్రభుత్వ వైఖరికి గట్టి సమాధానం చెప్పినట్లయింది. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి వాడకంపై ఇచ్చిన 69, 107 జీవోలను రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు పూర్తిగా తప్పుబడుతున్నాయి. జీవో 107 ప్రకారం శ్రీశైలం కనిష్ట నీటి మట్టాన్ని 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచారని, ఇది కేవలం ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు చేసిన ఎత్తుగడగా తెలంగాణ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక జీవో 69లో పేర్కొన్న ప్రొటోకాల్ వివరాలు సైతం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయంటున్నారు. ఈ రెండు జీవోలైపై పునఃసమీక్ష కోరుతూ త్వరలో కృష్ణా బోర్డు, కేంద్ర జల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని అధికారులు భావిస్తున్నారు. బోర్డు అత్యవసర సమావేశం ఇరు రాష్ట్రాల లేఖల నేపథ్యంలో కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండృ త్ బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనికి బోర్డు సభ్య కార్యదర్శులతో పాటు కేంద్ర జలసంఘం అధికారులు సైతం హాజరైనట్లు తె లుస్తోంది. ఈ భేటీలో శ్రీశైలం సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి మట్టాలు, ఆయా ప్రాజెక్టుల పరిధిలో విద్యుత్ ఉత్పత్తిపై చర్చించారు. దిగువ సీలేరు, కృష్ణపట్నం జల విద్యుత్ కేంద్రాల్లో ఏపీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌పైనా ఆరా తీశారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో నీటిమట్టాలు వేగంగా పడిపోవడంపై బోర్డు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరో 9 టీఎంసీల నీటిని వినియోగిస్తే ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగులకు పడిపోతుందని తెలుసుకొన్న బోృ్డు సభ్యులు.. నీటి నిల్వల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో సమీక్షించలేకపోయామని అభిప్రాయపడినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ఇరు రాష్ట్రాలను కూర్చోబెట్టి మాట్లాడినా ప్రస్తుత సమస్య పరిష్కారం కాదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. కేంద్ర జల సంఘం సైతం ఈ అంశంలో జోక్యం చేసుకునే అవకాశాలు లేవని బోర్డు వర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం. కుడిఎడమల వివాదం! రాష్ర్ట విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు కాలువ ఆంధ్రప్రదేశ్ పరధిలో ఉండగా.. తెలంగాణకు ఎడమగట్టు కాలువ ఉంది. తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ సర్కారు కొద్ది రోజులుగా ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికే కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసిన ఏపీ సర్కారు.. తెలంగాణను కూడా ఉత్పత్తి నిలిపేయాలని కోరుతోంది. నీటి మట్టాలు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టులో కనీస నీటి మట్టాలు కొనసాగించకపోతే.. తమ ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చడం కష్టమవుతుందని వాదిస్తోంది. దీనిపై ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కృష్ణా బోర్డుకు లేఖ రాయడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం తమకు న్యాయంగా దక్కాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వకుండా.. ఇటు జలవిద్యుత్‌కూ అవకాశం లేకుండా ఏపీ సర్కారు కుట్రలు పన్నుతోందంటూ రాష్ర్ట ప్రభుత్వం మండిపడింది. ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ కృష్ణా బోర్డుకు ఇప్పటికే లేఖ రాసింది. తాజాగా ఏపీ లేఖ నేపథ్యంలో అన్ని గణాంకాలు వివరిస్తూ తాజాగా మరోసారి లేఖ రాసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: