తెలంగాణలో ఆహార భద్రత కార్డులు, సామాజిక పెన్షన్లు కోసం ప్రజలను దరఖాస్తు చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లయిందా?రేషన్ కార్డులు,ఇతరత్రా అనర్హులను తగ్గించి ,ఆదా చేయాలని ఆలోచించి చేసిన ఈ ప్రయత్నంతో మొత్తం జనాన్ని రోడ్లపైకి తెచ్చినట్లయిందని టిఆర్ఎస్ నేతలు వాపోతున్నారు.ప్రభుత్వం కొందరు అధికారుల సలహాను విని ప్రజలను నేరుగా దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారని టిఆర్ఎస్ నేతలు అంగీకరిస్తున్నారు.ప్రస్తుతం లెక్కల ప్రకారం ఎనభై లక్షల మంది ఆహార భద్రత కార్డుల కోసం, ముప్పై లక్షల మంది పించన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నిటిని పరిశీలించడం మరో నెల,నెలన్నర రోజులు పట్టవచ్చు.దీనితో జనంలో టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత రావడానికి ఆస్కారం ఏర్పడిందని వారు అంటున్నారు.దీనిపై కొందరు నేతలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకువెళ్లారు.ఆయన కూడా అన్ని పరిశీలించిన తర్వాత ఈ పరిస్థితిని మార్చాలని,అనవసరంగా జనాన్ని రోడ్లపైకి తెచ్చి విమర్శలకు అవకాశం వచ్చిందని అంగీకరించారని చెబుతున్నారు.దీంతో క్రమేపి ఈ గొడవ నుంచి బయటపడాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.కొందరు అధికారులు ఇచ్చిన సలహా వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని,కేవలం అదికారుల మాటే వింటే ఇలాంటి సమస్యలు వస్తాయని టిఆర్ఎస్ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: