ఒకప్పుడు తీవ్రమైన నీటి ఎద్దటి ఎదుర్కొన్న గుజరాత్ రాష్ట్రం.. ఆ తర్వాత ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించుకుంది. ఆనాటి సీఎం మోడీ కృషితో గుజరాత్ ఇప్పుడు నీటి సమృద్దిని సాధించింది. అందుకోసం ఆయన ప్రభుత్వ వ్యవస్థలను సమన్వయపరిచారు. అవసరమైన కొన్నింటిని విడదీశారు. పక్కా ప్రణాళికతో జలం విషయంలో స్వయం సమృద్ధి, సరఫరా సాధించారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే బాటలో అడుగులు వేస్తారట. తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ భారీ ప్రణాళిక రూపొందించారు. దీనికోసం27వేల కోట్ల రూపాయలతో తెలంగాణ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును చేపడుతున్నారు. గుజరాత్‌ వాటర్‌గ్రిడ్ అధ్యయన అనుభవాలతో పకడ్బందీ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రాథమిక సర్వే కోసం ప్రభుత్వం ఇప్పటికే వంద కోట్ల రూపాయలు విడుదల చేసింది కూడా. ప్రాథమిక సర్వే తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక పూర్తి చేసేందుకు మరో నాలుగు నెలలు పడుతుందని భావిస్తున్నారు. ఈ భారీ జల ప్రణాళికలో మొత్తం పాతికకుపైగా గ్రిడ్లు నిర్మిస్తారు. వాటిని ప్రధాన గ్రిడ్ తో అనుసంధానం చేస్తారు. ఇందులో ఫస్ట్ ఫేజ్ లో ఆరు గ్రిడ్ లు నిర్మిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాటర్‌ గ్రిడ్ కోసం..లక్షన్న కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేస్తారట. స్థానికులకు ఉపాధి కలిగేలా ఈ పైపుల నిర్మాణం రాష్ట్రంలోనే తయారు చేసేలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. గుజరాత్‌లోని పానీ సమితుల మాదిరిగా.. తెలంగాణలో కూడా గ్రామాల్లో నీటి సరఫరా, నిర్వహణ, వసూళ్ల బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: