ఎన్నికల ముందు విడిపోయిన పాత స్నేహితులు మళ్లీ చేతులు కలిపారు. మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటుకు పాతమిత్రులు శివసేన, బీజేపీ అంగీకారానికి వచ్చాయి. ఎన్సీపీ భేషరతు మద్దతుతో కాస్త డైలమాలో పడ్డట్టు కనిపించినా.. బీజేపీ మళ్లీ శివసేనతోనే దోస్తీ కట్టింది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య జరిగిన ప్రాథమిక చర్చలు ఫలవంతంగా ముగిశాయి. ఢిల్లీ వెళ్లి కమలనాథులతో చర్చలు జరిపిన శివసేన నేతలు సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు రెడీ అన్నారు. అంతే కాదు... ఈ నెల 26న ప్రధాని మోదీ తొలిసారిగా ఎన్డీఏ ఎంపీలకు ఇస్తున్న విందుకు శివసేన ఎంపీలు హాజరవుతారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే మహారాష్ట్ర ప్రజలు భాజపా, శివసేనకు మెజార్టీ ఇచ్చారని ఇప్పుడు శివసైనికులు కొత్త పాట పాడుతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చిన పార్టీలు.. సోమవారం నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు పూర్తిస్థాయిలో జరపుతాయట. ఉపముఖ్యమంత్రి పదవితో పాటు కొన్ని కీలక మంత్రిత్వ శాఖలను శివసేన డిమాండ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించేందుకు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కు అడ్డుగా ఉన్న అంశాలన్నీ తొలగిపోతున్నాయి. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని విదర్భకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేసినా... కేంద్రంలోనే తాను కొనసాగుతానని గడ్కరీయే క్లారిటీ ఇవ్వడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టైంది. గురువారం దేవేంద్ర ఫడ్నవిస్‌, నితిన్‌ గడ్కరీ రెండుసార్లు భేటీ అయ్యారు. ఫడ్నవిస్‌తో తనకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేసిన గడ్కరీ...భాజపా కేంద్ర నాయకత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించడానికి సిద్ధమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: