వైఎస్సాఆర్ సిపి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని తొలగించి ఆ స్థానంలో చొక్కాకుల వెంకట్రావును నియమించడం పట్ల పార్టీశ్రేణుల్లో తీవ్రస్థాయిలో నిరసన పెల్లుబుకుతోంది. గడచిన చాలాకాలంగా వైసీపి రాష్ట్ర అధ్యక్షులు జగన్‌మోహన రెడ్డి వ్యవహార శైలి పట్ల కినుకువహించి ఆయనకు అల్లంత దూరాన మెలుగుతున్న మాజీమంత్రి కొణతాలకు బాబ్జీ అత్యంత విధేయుడు కావడం వల్లే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆయన అభిమానులు వాపోతున్నారు. గడచిన ఎన్నికల్లోనే మాజీమంత్రి కొణతాల, వైసీపి నేత జగన్‌మోహన రెడ్డిల మధ్య బాగా దూరం పెరిగింది. ఎన్నికల తరువాత జగన్‌మోహన రెడ్డి జరిపే జిల్లాలో ఏ పర్యటనకు కూడా కొణతాల హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారు. ఇటీవల తుఫాను బాధితులను పరామర్శించేందుకు జగన్ జిల్లాకు వచ్చే సందర్భంలోను కొణతాలతోపాటు గండి బాబ్జీ సైతం డుమ్మాకొట్టారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో జరిగిన జగన్ వరద బాధితుల పరామర్శ కార్యక్రమాలకు సైతం నియోజకవర్గ ఇన్‌చార్జి అయిన బాబ్జీ గైర్హాజరు కావడం తనకు జరిగిన పెద్ద అవమానంగా జగన్ భావించి సీరియస్‌గా తీసుకునే ఈ చర్యలకు పాల్పడ్డారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపి ఇన్‌చార్జిగా ఉన్న చొక్కాకులను ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న గండిబాబ్జీని తప్పించి ఆ స్థానంలో నియమించారు. విశాఖ ఉత్తరం వైసీపి ఇన్‌చార్జి బాధ్యతను మాజీ ఎమ్మెల్యే తైనాలకు అప్పగించారు. నియోజకవర్గంలో తనకంటూ వ్యక్తిగత ప్రజాబలాన్ని, పార్టీ కేడర్ బలాన్ని కూడగట్టుకున్న బాబ్జీని తొలగించి ఆ స్థానంలో చొక్కాకులకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో గండి బాబ్జీ తన స్వగ్రామమైన మొగలిపురంలో నియోజకవర్గ పరిధిలోని పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల పార్టీ శ్రేణులతో మండలాల వారీగా సమావేశమై తన రాజకీయ భవితవ్యంపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుండి తప్పించి జగన్ అవమానించినందున వేరొక పార్టీలోకి వెళ్లడమే సరైందని సూచించినట్లు తెలిసింది. మెజార్టీ పార్టీశ్రేణులు జగన్‌ను కలిసి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎందుకు బాబ్జీని తొలగించాల్సి వచ్చిందో వివరణ కోరాలని, ఆయనకు ఇష్టం లేకుంటే బాబ్జీతోపాటు తాము కూడా పార్టీని విడిచి వెళ్లిపోతామని స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు బాబ్జీ కూడా సుముఖత వ్యక్తం చేసి ముందుగా జగన్ అపాయింట్‌మెంట్ తీసుకుని పార్టీశ్రేణులతోపాటుగా ఆయనను కలవాలని నిర్ణయించుకున్నామని గండి బాబ్జీ సూచనప్రాయంగా తెలిపారు. జగన్ నుండి వచ్చిన స్పందనను బట్టి తన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. వైఎస్సాఆర్ పార్టీలో ఉండాలో వెళ్లిపోవాలో జగన్‌నే అడుగుతామని, అందుకు అనుగుణంగానే భవిష్యత్ రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జగన్ తుఫాను బాధితులను పరామర్సించేందుకు జిల్లాకు వస్తున్నట్లు తనకు సమాచారమే లేదని బాబ్జీ అంటుండగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్ మాత్రం ఆయనకు సమాచారం అందజేసానని పార్టీ అధినేత జగన్‌కు నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: