ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయం ఎవరిది? ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకొన్న సొంత నిర్ణయమా? లేక మరో రకంగా ఆలోచించి తీసుకొన్న నిర్ణయమా? అనే విషయం గురించి ఎవరికి క్లారిటీ లేదు. ఒకదశ వరకూ తెలుగుదేశం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే అభిప్రాయాలే వినిపించాయి. అయితే చివరకు మాత్రం పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తికావడానికి తెలుగుదేశం సహకరించింది. మరి ఇలాంటి పరిణామాలకు కారణం ఎవరు? అంటే.. అది జనసేన అధినేత పవన్ కల్యాన్ అని చెప్పకతప్పని పరిస్థితి. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యాకా భూమా నాగిరెడ్డి స్పందించిన తీరు చూశాకా... ఈ అభిప్రాయానికి రావాల్సి వస్తోంది. తన కుమార్తె ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేలా చూసిన వారందరికీ ధన్యవాదాలను చెబుతూ భూమా నాగిరెడ్డి జనసేన అధ్యక్షుడికి ధన్యవాదాలు చెప్పాడు. ఈ విషయంలో పవన్ ప్రత్యేక చొరవ చూపాడని భూమా వ్యాఖ్యానించాడు. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని భూమా పేర్కొన్నాడు. మరి ఆయన ఇంతలా చెబుతున్నాడంటే... తెలుగుదేశం నిర్ణయాన్ని పవన్ కల్యాన్ ప్రభావితం చేశాడనే అనుకోవాల్సి వస్తోంది. మొదట తెలుగుదేశం వాళ్లు ఆళ్లగడ్డలో పోటీ చేయాలని అనుకోవడం.. తర్వాత మాత్రం వాళ్లే వెనక్కు తగ్గడాన్ని బట్టి చూస్తే... ఈ రెండు నిర్ణయాలకూ మధ్య పవన్ కల్యాన్ ప్రమేయం ఉందని చెప్పాల్సి వస్తోంది. తెలుగుదేశం వాళ్లు పోటీకి అనుకూలంగానే ఉన్నప్పటికీ పవన్ జోక్యంతోనే ఇక్కడ ఎన్నిక పోటీ లేకుండానే పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ విధంగా పవన్ కల్యాన్ తెలుగుదేశం పార్టీని ప్రభావితం చేస్తున్నాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: