జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. వచ్చే నవంబర్ 25న ఈ రెండు రాష్ట్రాల శాసనసభలకూ తొలి దశ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 5 దశల్లో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ ఆ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్-ను శనివారం విడుదల చేశారు. ఎన్నికల నిబంధనావళి తక్షణమే అమలులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. వరదల వల్ల జమ్ము కాశ్మీర్-లో ఎన్నికలు ఆలస్యమయ్యాయని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ రెండవ దశ డిసెంబర్ 2న, డిసెంబర్ 9న మూడో దశ, డిసెంబర్ 14న నాలుగో దశ, 20న ఐదో దశ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల ప్రధానాధికారి వీఎస్ సంపత్ వివరించారు.  రెండు రాష్ట్రాల్లోను పూర్తిగా ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహిస్తామని సంపత్ స్పష్టంచేశారు. జమ్ము కాశ్మీర్-లో మొత్తం 87, జార్ఖండ్-లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ‘నోటా’ ఓటు కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 23న ఉంటుందని వీఎస్ సంపత్ చెప్పారు. జమ్ము కాశ్మీర్-లో 10,015 పోలింగ్ బూత్-లు, జార్ఖండ్-లో 24,648 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: