ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆది వారం ఎన్డీఏ ఎంపీలకు తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రియ పథకాల అమలు గురించి వారికి ఉద్బోదించారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ఉద్యమరీతిలో చేపట్టాలని, ఎంపి ఆదర్శ గ్రామ పథకాన్ని ఉత్సాహంగా స్వీకరించాలని పార్లమెంట్‌ సభ్యులకు మోడీ పిలుపు నిచ్చారు. ఎంపీల మద్దతు, వారి భాగ స్వామ్యం ఉంటేనే తాను ఆశిస్తోన్న విజయం సాధించగలనని, తనకు ఇష్టమైన ఈ రెండు పథ కాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లగలమని తెలి పారు. విందు ఆరగిస్తున్న సమయంలోనే ఎంపీల కు స్వచ్ఛభారత్‌, సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన గురించి వీడియో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ పథకాలలోని విశేషాలను ఇందులో పొందు పర్చారు. మోడీ ఒక్కరోజు క్రితం దివాళీ మిలన్‌ను మీడియా వారికోసం ఏర్పాటు చేయగా, ఆదివారం ఎంపీలకు ఈ విందు ఏర్పాటు అయింది. ఈ తేనీటి విందులో జరిగిన కార్యక్రమాల గురించి ఆ తరువాత విలేకరులకు సమాచార ప్రసారాల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలియచేశారు. ఎంపీలు తలా ఓ మూడు గ్రామాలను దత్తత తీసుకునే పథకాన్ని ప్రధాని మోడీ ఈ నెల 11న ప్రారంభించారు. ఇది చాలా కీలకమైన పథకమని, దీనిలో ఎంపీలు చురుగ్గా పాల్గొనాలని, పోటీ పడాలని వీడియో సమర్పణ సందర్భంగా గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం గురించి పట్టణాభివృద్ధి శాఖామాత్యులు వెంకయ్యనాయుడు వీడియో ప్రదర్శన నిర్వహించారు. దానిలోని విశేషాలను, దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న స్పందనను తెలిపారు. ఎంపీలకు దివాళీ మిలన్‌ను ఏర్పాటు చేయడం మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో జరిగింది. రాష్ట్రంలో శివసేన మద్దతుతోనే ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి ముందుకు వెళ్లనుందనే వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ భేటీ నిర్వహించారు. ఈ విందుకు శివసేన ఎంపీలంతా హాజరు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: