ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్షబీభత్సం మళ్ళీ చెలరేగింది. ఒకవైపు తుపాను, మరోవైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఆదివారం వరదల తాకిడికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. ఖరీఫ్‌ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ రంగానికి మరోసారి కోలుకోలేని దెబ్భ తగిలింది. గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామ సమీపంలో వాగు దాటుతున్న క్రమంలో అక్కాచెల్లెళ్ళు వరదనీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. గోలివాగు పొంగి పొర్లడంతో దాదాపు తొమ్మిది గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. గురజాలలో అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉరు ములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇంకొల్లు, అద్దంకి మండలాలు వర్షపునీటితో అతలాకుతలమయ్యాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు చెరువులు, కుంటలన్నీ పొంగి పొర్లుతున్నాయి. అవుకు మండల పరిధిలోని కొండరాయపల్లి గ్రామ సమీపంలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి సుబ్రమణ్యం మృతి చెందాడు. ఈ ఘటనలో 136 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఏపీ, కర్నాటక రాష్ట్రాల మధ్య ఆలూరు సరిహద్ధు ప్రాంతంలో హగరి నదిపై వంతెన కూలి పోయింది. దీంతో ఇరు రాష్ట్రాలకు రాకపోకలు స్తంభించాయి. వరుస తుపానులు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. మొన్నటి వరకూ ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుధూద్‌ తుపాను నుంచి తేరుకోకముందే నీలోఫర్‌గా నామకరణం చేసిన మరో తుపాను వచ్చిపడింది. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను ఈనెల 30న మహారాష్ట్రలోని ముంభై సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయి. ఆదివారం సాయం త్రానికి అందిన సమాచారం మేరకు ముంభై నగరానికి నైరుతి దిశగా 1270 కిలోమీటర్ల దూరంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్రమేపీ పశ్చిమ దిశగా కదులు తున్న ఈ ద్రోణి ఓమన్‌, యెమెన్‌ దేశాలవైపు వెళ్ళే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఉత్తర దిశగా కదిలితే గుజరాత్‌ రాష్ట్రంతోపాటు దక్షిణ పాకిస్తాన్‌లపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, దీని కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి ముప్పు వాటిల్లబోదని భారత వాతావరణ శాఖ అధికా రులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాన్ని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం కూడా దృవీకరించింది. కానీ నీలోఫర్‌ తుపాను కారణంగా ఆకాశమంతా క్యుములోనింబస్‌ మేఘాలు కమ్ముకోవడంతో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో గడిచిన 24 గంటలుగా కొన్నచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దీని ప్రభావం మరో 48 గంటలపాటు ఉంటుందని, రానున్న 24 గంటలపాటు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, తెలంగాణాలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిం చారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో చదురుముదురు జల్లులు కురుస్తాయని తెలిపారు. గడిచిన వారం రోజుల్లోనే ఒకదానివెంట మరొకటి వరుస తుపానులు ఏర్పడిన కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేడెక్కిన వాతావరణంతో ఈ ఏడాది శీతాకాలం ఉండదేమోనన్న ఆందోళన కలుగుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. గాలిలో తేమశాతం, చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శంషాబాద్‌ నుంచి మంగళూరు, భువనేశ్వర్‌, ముంభై, కువైట్‌ తదితర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వినామాలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరాయి. చెన్నై వెళ్ళాల్సిన మరో విమానం రద్ధయింది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్ల డించిన సమాచారం మేరకు ఆదివారం నెల్లూరు జిల్లా ఉదయగిరి, గుంటూరు జిల్లా మాచెర్లలో అత్యధికంగా 29 సెంటిమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా రెంటచింతలలో 15, బాపట్లలో 11, ఎర్రగొండపాలెం, కారంచెడు, అద్ధంకిలలో 10, అద్ధంకి, దర్శి, ఆవనిగడ్డ, నంధ్యాల, జమ్మలమడుగు, ప్రొద్ధు టూరు, కోయిలకుంట్ల, పోరుమామిళ్ళ తదితర ప్రాంతాల్లో 9 సెంటిమీటర్ల వర్షపా తం నమోదైంది. మిగతా అనేక ప్రాంతాల్లో 5నుంచి 8 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: