ఏళ్ళ తరబడి పొదుపు చేసుకుంటున్న స్వయం సహాయక సంఘాల మహిళల ఖాతాల నుంచి నాలుగు కోట్ల రూపాయలు చెప్పచేయకుండా ఒకేసారి బ్యాంకులు రుణాలకు వడ్డీల పేరిట లాగేసుకున్నాయి. ఐదు లక్షల మంది మహిళల ఖాతాల నుంచి బ్యాంకులు జమ చేసుకున్న పొదుపు సొమ్ము ఖాళీ కావడంతో వారిలో ఆత్మస్థైర్యం నీరుగారిపోయింది. జిల్లాలో 43 వేలకుపైగా స్వయంశక్తి సంఘాలు ఉన్నాయి. ప్రతీ సభ్యురాలి ఖాతాలో కనీసం ఆరు వేల రూపాయలు పొదుపు నిల్వలు ఉండేవి. ఇప్పుడు ఆ పొదుపు ఖాతాలు ఖాళీ కావడంతో సభ్యులు, బృందం అధ్యక్షుల మధ్య ఘర్షణలకు దారితీసింది. రుణమాఫీ మాయాజాలం మహిళలను కొంపముంచేలా మారింది. పొదుపే..మదుపులా మారాల్సి వచ్చింది. గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నది ప్రభుత్వ సంకల్పం. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థికంగా వారిని ఉన్నతుల్ని చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందున్న లక్ష్యం. దానికోసం అన్ని మార్గాలను అనే్వషిస్తూ సంపూర్ణ ఆర్థిక వికాసమే ధ్యేయంగా ‘పేదరికంపై గెలుపు’ అంటూ జీవితాన్ని జయించాలన్న ఆయన పిలుపు స్వయంశక్తి సంఘాల ఓటమికి దగ్గరవుతోంది.  స్వయం సహాయ బృందాల సక్సెస్ స్టోరీలన్నీ ఒక్కసారిగా రుణమాఫీ మాయాజాలంలో పల్టీకొట్టేలా కన్పిస్తున్నాయి. కేవలం 56 కోట్ల రూపాయలతో ఆరంభమైన ఈ సంఘాల విజయ పరంపర 2013-14 నాటికి 8532.07 కోట్ల రూపాయలకు చేరుకుందన్న ఆనందం కంటే, డ్వాక్రా మహిళల రుణాల రద్దు చేయాలన్న ఆశయానికి బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. రాష్ట్ర మంత్రి మండలి ఆగస్టు 2న స్వయంశక్తి సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రతీ సంఘానికి లక్ష రూపాయల వరకూ పెట్టుబడి సమకూర్చాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. నేరుగా సంఘాల బ్యాంకు ఖాతాల్లో పడుతుందని చెప్పిన సిఎం మాటలు నీటిమూటగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో 43,743 సంఘాల్లో ఐదు లక్షల 10 వేల 401 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా నెలకు వంద రూపాయలు చొప్పున్న పొదుపు చేసుకుంటారు. గత మూడు నెలలుగా బ్యాంకులు స్వయంశక్తి సంఘాలకు ఇచ్చే రుణాలు ముఖ్యమంత్రి మాఫీ చేస్తారన్న ఉద్దేశ్యంతో ఆ రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారి ఖాతాల నుంచి జిల్లా అంతటా నాలుగు కోట్ల రూపాయలు బ్యాంకర్లు వడ్డీల పేరిట జమచేసుకున్నారు. దీంతో మహిళా సంఘాలు జుత్తు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకు తార్కణమే ఆదివారం జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన స్వయంశక్తి సంఘాల సమావేశాల్లో సభ్యులు ఆ బృందం అధ్యక్షురాలిపై తిరుగుబాటు చేయడం కన్పించింది. ఇందుకు బ్యాంకు అధికారులు సమాచారం ఇవ్వకుండా మూడునాలుగేళ్ళుగా పొదుపు చేసుకుంటున్న మొత్తం నుంచి మూడు నెలలుగా తీసుకున్న రుణాలకు చెల్లించని వాయిదాలకు వడ్డీలుగా ప్రతీ సభ్యుని ఖాతా నుంచి 800 నుంచి 1400 రూపాయల వరకూ జమచేసుకోవడంతో స్వయంశక్తి సంఘాల మహిళల మధ్య వాదోపవాదాలు, ముష్టియుద్ధాలు జరిగాయి. దీనికితోడు జిల్లా స్వయంశక్తి సంఘాల రుణాలకు సంబంధించి గతకొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఖాతా నుంచి బ్యాంకులకు 4.20 కోట్ల రూపాయల వరకూ వడ్డీ చెల్లింపులు నిలిచిపోవడం. ఇదంతా రుణమాఫీ మాయాజాలం వల్లే జరిగిందంటూ మహిళలు నాలుగునెలల టిడిపి పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. మాఫీ మాట లేకపోయినా సక్రమంగా ఎవరి రుణం వారే తీర్చుకునేవారమని మహిళలు వారికివారే సర్ది చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: