శ్రీశైలం కుడి గట్టు ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. శ్రీశైలం ఎడమ గట్టు ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రుష్ణా బోర్డును ఆశ్రయించింది. ఇదే రెండు రాష్ట్రాల మధ్య తాజా వివాదానికి కారణమైంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ పోతే రాయలసీమ ఎడారి అవుతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరెంట్ ఉత్పత్తి చేయకపోతే తెలంగాణ రైతులు అన్యాయం అవుతారంటూ కేసీఆర్ సమాధానమిస్తున్నారు. రాష్ట్ర పునర్ వ్యవస్తీకరణ చట్టం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అమలు అనుభవం, శ్రీశైలంలో నీటి వినియోగం విద్యుత్ ఉత్పత్తిపై గతంలో విడుదలైన జీవో 69, జీవో 107 ల ఆధారంగా రెండు రాష్ట్రాలు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలి. కాదంటే కేంద్రం మధ్యవర్తిత్వాన్ని కోరవచ్చు. కానీ పరస్పరం విమర్శించుకుంటే పెరిగేది విద్వేషాలే. జీవో 69 ప్రకారం 834 అడుగుల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు వీలుంది. గతంలో నీటి మట్టం అంతకన్నా తక్కువ స్థాయికి పడిపోయినప్పుడు కూడా శ్రీశైలంలో విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. ఈ జీవోను 1996లో చంద్రబాబు ప్రభుత్వమే విడుదల చేసింది.  2006 లో జీవో 107 విడుదలైంది. దీని ప్రకారం 854 అడుగుల దాకా శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయవచ్చు. 834 అడుగుల వరకు కూడా విద్యుదుత్పత్తి చేసేందుకు అవకాశం ఉండాలి అంటూ వైఎస్ ప్రభుత్వం జీవో 107 ను విడుదల చేసినపుడు టీడీపీ డిమాండ్ చేసింది. కానీ ఇప్పుడు 870 అడుగులు ఉండగానే విద్యుదుత్పత్తి ఆపివేసింది. తెలంగాణ వైపుకూడా విద్యుదుత్పత్తి ఆపివేయాలంటూ కృష్ణా బోర్డును కోరింది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. శ్రీశైలం నుంచి రాయలసీమ వైపుగా వెళ్లాల్సిన నికర జలాలు పోగా మిగిలిని నీటితో విద్యుదుత్పత్తి చేసుకునేందుకు తెలంగాణకు హక్కులున్నాయి. ఒకవేళ రాయలసీమ భవిష్యత్ నీటి అవసరాల కోసం కూడా శ్రీశైలంలో నీటిని నిల్వ ఉంచాలంటే ఆ మేరకు తెలంగాణకు అవసరమైన విద్యుత్ ను ఆంధ్రప్రదేశ్ ఇవ్వవచ్చు. తెలంగాణకు 300 మెగావాట్ల విద్యుత్ ను ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు.  అయితే శ్రీశైలం ఎడమ గట్టు ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ఆగిపోతే 900 మెగావాట్లు, కుడి గట్టు ప్రాజెక్టులో ఆపితే 770 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోతుంది. ఇందులో తెలంగాణకు సుమారు 900 మెగావాట్ల వాటా పోతుంది. 900 మెగావాట్లు నష్టపోయి 300 మెగావాట్లు తీసుకుంటామా? అంటూ తెలంగాణ సర్కార్ అభ్యంతరం చెబుతోంది. శ్రీశైలంలో నీటి నిల్వను జీవో 107 కు మించి ఉంచాలని ఆంధ్రప్రదేశ్ కోరితే ఆ మేరకు విద్యుత్ ను తెలంగాణకు ఇచ్చి సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా పరిష్కారం చూడాల్సింది పోయి పరస్పర విమర్శలతో కాలం గడపరాదు. తెలుగు రాష్ట్రాల్లో కావాల్సింది వేడి కాదు వెలుగులు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: