శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి వివాదం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజకీయ నేతల మధ్య సవాళ్ల పర్వానికి దారి తీస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ఇధ్దరూ ముఖ్యమంత్రలూ ఓ రేంజ్ లో మాటలయుద్ధానికి దిగిన సంగతి తెలిసింది. వారు మొదలుపెట్టిన డైలాగ్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట చంద్రబాబు విమర్శలు.. దాని కేసీఆర్ బదులు.. తెలంగాణ ముఖ్యమంత్రి స్పందనపై మళ్లీ ఏపీ మంత్రులు, నేతల స్పందనలు.. వాటిపై మళ్లీ తెలంగాణ మంత్రుల రియాక్షన్లు.. అబ్బో.. ఈ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. కేసీఆర్ విమర్శలకు సమాధానంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్.. బదులిచ్చిన సంగతి తెలిసిందే.. ఆయన ఏకంగా... కేసీఆర్ కు జీవో 69, 107లను చదవి అర్థం చేసుకునే పరిజ్ఞానం లేదని విమర్శించడం.. తెలంగాణ నేతలకు కోపం తెప్పించింది. పరకాల విమర్శలకు బదులిచ్చిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు.. అసలు ఆ జీవోలు.. చంద్రబాబు, ఉమామహేశ్వరరావు, పరాకాల ప్రభాకర్ లకే అర్థం కాలేదని విమర్శించారు. ఆ ఇంగ్లీష్ అర్థం కాకపోతే.. తాను ఓ ఇంగ్లీష్ టీచర్ ను పంపుతానన్నారు. ఆయనతో చదివించుకోవాలని వెటకారం గుప్పించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు వెటకారాలు సాధారణమే కానీ.. ఇక్కడో విశేషం ఉంది. పరకాలకు ఇంగ్లీష్ వచ్చో రాదో అని హరీశ్ రావు తెలిసి అన్నారో.. తెలియక అన్నారో తెలియదు కానీ.. విద్యాధికుడైన పరకాలకు చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. రాజకీయ కుటుంబంలో పుట్టిన పరకాల.. ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదువుకున్నారు. ఢిల్లీలోని జవహర్లార్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్ చేశారు. అలాంటి పరకాలకు ఇంగ్లీష్ నేర్పిస్తానని హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదమే..

మరింత సమాచారం తెలుసుకోండి: