కేసీఆర్.. ఏ ముహూర్తాన టెన్నిస్ క్రీడాకారణి సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారో కానీ.. సానియా దూకుడుకు అడ్డులేకుండా పోయింది. మొదటో కోటి రూపాయలు.. ఆతర్వాత యూఎస్ ఓపెన్ గెలుచుకున్నప్పుడు మరో కోటి రూపాయలు కేసీఆర్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. మరి ఆ ప్రోత్సాహమో ఏమో కానీ సానియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొన్న యూఎస్ ఓపెన్, నిన్న ఆసియా గేమ్స్‌లో మిక్స్‌డ్ ట్రోఫీలను ముద్దాడిన ఈ హైదరాబాదీ తాజాగా డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లోనూ జయభేరి మోగించింది. కెరీర్‌లో మరో మరపురాని విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి ప్రయత్నంలోనే తన జోడీ కారా బ్లాక్తో కలిసి డబ్ల్యూటీఏ ఫైనల్స్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుని సానియా సత్తా చాటింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జంట సూ వే సీ (చైనీస్ తైపీ), షువాయ్ పెంగ్ (చైనా)తో తలపడి.. 6-1, 6-0తో తిరుగులేని విజయం సాధించింది. కనీసం ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ప్రత్యర్థి పాలు కాకుండా సానియా జోడీ సంపూర్ణాధిపత్యం ప్రదర్శించింది. కేవలం 59 నిమిషాల్లోనే ప్రత్యర్థులని చిత్తు చేసింది. ఈ టోర్నీ ఫైనల్ చరిత్రలో ఇంత భారీ తేడాతో ఓడించడం ఓ రికార్డే. గతేడాది జింబాబ్వే క్రీడాకారిణి కారాబ్లాక్‌తో జతకట్టడం సానియాకు బాగా కలసి వచ్చింది. ఇద్దరూ సమన్వయంతో ఆడి.. టోక్యో, బీజింగ్ ఓపెన్‌లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఐతే ఈ జోడీ ఇకపై సంచలనాలు నమోదు చేసే అవకాశం లేదు. ఎందుకంటే కారా బ్లాక్ కు రెండేళ్ల బాబు ఉన్నాడు. 2015నుంచి రిటైర్ అవబోతున్నట్టు ఆమె ముందుగానే ప్రకటించింది. సో.. సానియా, కారాకు జోడీగా ఇదే చివరి టోర్నీ అన్నమాట. తాజా గెలుపుతో సానియా జోడీకి చెరో కోటిన్నర రూపాయలు ప్రైజ్ మనీగా దక్కనున్నాయి. మరి ఈసారి కేసీఆర్ ఎంత బహుమతి ప్రకటిస్తారో.. చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: