నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా ఎదుగుతున్న విజయవాడ-గుంటూరు పరిసరాల్లో నయా కల్చర్ ఊపందుకుంటోంది. కార్ల రేసుల పేరిట శరవేగంగా విస్తరిస్తున్న ఈ కల్చర్ ఆదివారం రాత్రి ఓ ఇంజినీరింగ్ విద్యర్థిని బలి తీసుకుంది. విజయవాడ-చిలకలూరిపేట మధ్య ఎడ్లపాడు వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నాగేంద్ర అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన కారులో విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే పుత్రరత్నం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్ల రేసుల్లో భాగంగా అతి వేగంగా వెళుతున్న నేపథ్యంలో రెండు కార్లు ఢీకొన్నాయని స్థానికులు చెబుతున్నా, వివాహ వేడుకకు వెళుతున్న క్రమంలోనే ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుందని సదరు ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కొత్త రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విజయవాడ-గుంటూరుల మధ్య యువత పెద్ద ఎత్తున కారు రేసులను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ధనవంతుల పుత్రరత్నాలు లక్షల రూపాయల బెట్టింగ్ లతో జరుగుతున్నఈ రేసులకు చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో ఈ కల్చర్ వెర్రి తలలు వేసే ప్రమాదం లేకపోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: