వాళ్లు పార్టీలకు దిశానిర్దేశం చేసే వాళ్లు... రాజకీయాలను శాసించిన, శాసిస్తున్న వాళ్లు. ప్రధాన పార్టీలకు ఐ కాన్ ల లాంటి వాళ్లు. వాళ్ల మీద ఎంతో బాధ్యత ఉంది. తాము చక్కటి నడవడికను కొనసాగించి... తమ పార్టీ వాళ్లను కూడా అదే దారిలో నడిపించాల్సిన బాధ్యతను కలిగిన వాళ్లు వాళ్లంతా. అయితే ఆ నేతలు మాత్రం ఆ స్థాయిలో వ్యవహరించడం లేదు! సగటు ఎంపీల్లాగానే వ్యవహరిస్తున్నారు వాళ్లంతా! కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, భారతీయజనతా పార్టీ కీలక నేత ఎల్ కే అద్వానీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ, భారతీయ జనతా పార్టీ ఒకనాటి జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ వంటి.. వాళ్లందరూ తమ ఆస్తుల వివరాలను అందించలేదని... తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఆస్తుల వివరాలను ప్రకటించని ఎంపీల జాబితాను విడుదల చేశారు. వీరి సంఖ్య దాదాపు 400 వరకూ ఉంది. మొత్తం 543 మంది ఎంపీల్లో 401 మంది ఇంత వరకూ ఆస్తుల వివరాలను తెలియజేయలేదని అధికారులు వివరించారు. పార్టీల వారీగా చూస్తే... ఆస్తుల వివరాలు తెలియజేయని ఎంపీలలో 209 మంది బీజేపీ వారు. కాంగ్రెస్ నుంచి 31, టీఎంసీ 27, బీజేడీ 18, టీడీపీ 14, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలు కూడా ఆస్తుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. చట్టం ప్రకారం ఎంపీలుగా ఎన్నికైన 90 రోజుల్లోనే ఆస్తుల వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఆ గడువు దాటిపోవడంతో ఈ ఎంపీల పేర్లు బయటకు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: