మోదీ ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టదలుచుకుంటే అక్కడెక్కడో విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. మన నల్లధనాన్ని అరికట్టడానికి మన దేశంలోనే చర్యలు తీసుకోవచ్చు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీ కఠినంగా వ్యవహరించి మన దేశంలో అవినీతిని అంతమొందిస్తే విదేశాలకు డబ్బు ప్రవాహమూ ఉండదు, మళ్ళా మన దేశంలోకి మరో రూపంలో రావడమూ జరగదు. నల్లధనంపై ఎన్నికల ముందు హడావుడి చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు తావిస్తున్నది. విదేశాలలో నల్లధనం దాచుకున్న వారి వివరాలను బయట పెట్టలేమని, బయట పెడితే ఆయా దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించినట్టవుతుందని మోదీ ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టుకు వెల్లడించడం ఆశ్చర్యం కలిగించింది. గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా విదేశాలలో నల్లధనం దాచుకున్న వారి పేర్లను వెల్లడించక పోవడానికి కారణం విదేశాలతో ఒప్పందాల ఉల్లంఘన జరుగుతుందనే. కాంగ్రెస్ పార్టీ అవినీతిపరులను వెనకేసుకు వస్తున్నదంటూ ఎన్నికల ముందు యాగీ చేసిన బీజేపీ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నల్లధనం దాచుకున్న వారి పేర్లను బయట పెడతామని హామీ ఇచ్చింది. ప్రతిపక్ష స్థానంలో రాజకీయ పక్షానికి ఈ చిన్న విషయం తెలువదా? తెలిసి కూడా ఈ అంశాన్ని ఎన్నికల కోసం ఎందుకు ఉపయోగించుకున్నట్టు? ఇది చాలదన్నట్టు- కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో అడుగు ముందుకు వేసి- విదేశాలలో నల్లధనం దాచుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పెద్ద మనిషి కూడా ఉన్నట్టు వెల్లడించాడు. ఈ పెద్ద మనిషి పేరు బయట పెడితే పార్టీ ఇరుకున పడుతుందని వ్యాఖ్యానించాడు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు మొత్తం వాస్తవాలు వెల్లడించకుండా ఎంపిక చేసిన అంశాలు బయటపెట్టడం, నల్లధనం వంటి అంశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడం మంచి పద్ధతి కాదు. అర్ధసత్యాలు మాట్లాడడం ఒక్కోసారి అబద్ధాల కన్నా ముప్పుగా పరిణమిస్తాయి. యూపీఏ రెండవ పర్యాయం పాలన చివరి దశకు వచ్చే నాటికి మన్మోహన్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో అప్రతిష్టపాలైంది. అనేక కుంభకోణాలు బయటపడ్డాయి. ప్రజలు మార్పును కోరుకున్నారు. అయితే విదేశాలలోని నల్లధనం బయట పెట్టేందుకు చర్యలు తీసుకున్నదంటూ ఇటీవల మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పిన మాటల్లో కొంత వాస్తవం కూడా ఉన్నది. యూపీఏ ప్రభుత్వం నల్లధనం దాచుకున్న కొంద రి జాబితాను జర్మనీ నుంచి తెప్పించి సుప్రీం కోర్టుకు అప్పగించింది. జీ20 వేదికపై నల్లధనం బయటికి తేవడానికి సమష్టి కార్యాచరణకు పూనుకున్నది. సెబి దగ్గర నమోదు చేయించుకున్న ఎఫ్‌ఐఐల ద్వారా కాకుండా ముక్కూ మొహం తెలువని వ్యక్తులు పార్టిసిపేటరీ నోట్స్ మార్గం ద్వారా నిధులు పెట్టుబడులు కుమ్మరించడాన్ని అరికట్టడానికి ప్రయత్నించింది. మరోవైపు నల్లధనానికి తెల్లరంగు వేయడానికి గతంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న చర్య విమర్శలకు తావిచ్చింది. మన దేశంలో అక్రమంగా పోగుచేసుకున్న సొమ్మును విదేశాలకు తరలించడం, విదేశాలలో నామమాత్ర పు కంపెనీలు స్థాపించి వాటి ద్వారా మళ్ళా మన దేశంలోకి తేవడం ఎంతో కాలంగా జోరుగా సాగుతున్నది. మన దేశంలోకి ఈ విధంగా ప్రవేశిస్తున్న అక్రమధనంలో నలభై శాతం మారిషస్ మార్గంగా వస్తున్నది. మన దేశంలోకి ఆదాయపు పన్ను అధికారులకు ఈ విదేశీ సొమ్ము మూలాలలపై దర్యాప్తు జరిపించే అధికారం ఉండేది. అయితే ఈ అధికారానికి కత్తెర వేస్తూ- 2000 సంవత్సరంలో వివాదాస్పద సర్క్యులర్ జారీ చేసి- అక్రమ ధన ప్రవాహానికి తలుపులు పూర్తిగా తెరిచిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే. దీనిని బట్టి తాము పరిశుద్ధులమని ఏ పార్టీ చెప్పుకునే స్థితిలో లేదని తెలుస్తున్నది. గత సార్వత్రిక ఎన్నికల ముందు అవినీతి అనేది ప్రధాన నినాదంగా ముం దుకు వచ్చింది. దీంతో బీజేపీకి నల్లధనం అనేది ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడ్డది. వంద రోజుల్లో నల్లధనం వెలికి తీయిస్తానని బీజేపీ ఎన్నికల ముందు మాట ఇచ్చినప్పటికీ దానిని లెక్క తప్పకుండా వంద రోజుల్లోనే నెరవేర్చలేక పోవచ్చు. కానీ ఈ దిశగా అడుగులు పడా లె. ఆ మేరకు చిత్తశుద్ధిని ప్రదర్శించాలె. మోదీ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉంటుంది. ఆ తరువాత మళ్ళా ప్రజల ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఐదేండ్ల కాలంలోనైనా బీజేపీ నల్లధనాన్ని వెలికితీయడానికి, అవినీతిని రూపు మాపడానికి కృషి చేస్తుందా అనేది ప్రజలు గమనిస్తారు. నిజానికి స్విస్‌బ్యాంకులలో నల్లధనం దాచుకోవడమనేది పాత మాట. ఇప్పుడు నల్లధనం దాచుకోవడానికి ఎన్నో మరెన్నో దేశాలు అవతరించాయి. మోదీ ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టదలుచుకుంటే అక్కడెక్కడో విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. మన నల్లధనాన్ని అరికట్టడానికి మన దేశంలోనే చర్యలు తీసుకోవచ్చు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీ కఠినంగా వ్యవహరించి మన దేశంలో అవినీతిని అంతమొందిస్తే విదేశాలకు డబ్బు ప్రవాహమూ ఉండదు, మళ్ళా మన దేశంలోకి మరో రూపంలో రావడమూ జరగదు.

మరింత సమాచారం తెలుసుకోండి: