ఎనమండుగురు నల్లకుబేరులపేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా సాగుతూ, విపరీత పరిణామాలకు దారితీస్తోన్న నల్లధనం వెలికితీత తరతరాల నుంచి జటిలంగా మారుతూ వచ్చింది. విదేశాలలో నల్ల ధనం దాచుకున్న భారతీయుల సమాచారం వెల్లడిం చాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ బ్లాక్‌ జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ జాబితాలో చోటుచేసుకున్న నల్లకుబేరుల జాబితాలో ప్రధానంగా డాబర్‌ ఇండి యా ప్రమోటర్లలో ఒకరైన ప్రదీప్‌ బర్మన్‌, రాజ్‌కోట్‌ కు చెందిన బులియన్‌ వ్యాపారి పంకజ్‌ చమన్‌లాల్‌ లోధ్యా, గోవా మైనింగ్‌ కంపెనీ టింబ్లూ ప్రైవేటు లిమిటెడ్‌తో పాటు అందులోని ఐదుగురు డైరెక్టర్ల పేర్లను ఈ జాబితాలో చూపించారు. ఈ జాబితాలో రాజకీయ నాయకుల పేర్లు ఏవీ చోటుచేసుకోలేదు. అయితే బ్లాక్‌మనీ ఖాతాదార్ల పేర్లను మరికొన్నింటిని కూడా పూర్తి పరిశీలన తరువాత వెల్లడిస్తామని, నల్లధనం దాచుకున్నట్లుగా ఖరారు అయిన వారిని దాచిపెట్టేది లేదని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలిపింది. విదేశాలతో ఉన్న ద్వంద్వ పన్నుల ఒప్పందాల వల్ల నల్లధనం ఖాతాదారుల పేర్లను వెల్లడించడం కష్టంగా ఉందని ఇటీవలే ప్రభుత్వం తెలియచేసుకుంది. దీనిపై తీవ్రస్థాయిలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెలువడ్డాయి. దీనిపై స్పందనగా ప్రభుత్వం తొలి అఫిడవిట్‌లో వివరాలను సమర్పించింది. అనుబంధ అఫిడవిట్‌ ఉంటుందని విన్నవించుకున్నారు. తమ తనిఖీల తరువాత వెల్లడయ్యే బ్లాక్‌మనీ ఖాతాదార్ల వివరాలను మరింతగా తెలియచేస్తామని తెలిపారు. అయితే విదేశీ బ్యాంక్‌లలో భారతీయులు ఖాతాలు తెరిచినట్లయితే, ఇక అవన్నీ నల్లఖాతాలే అనుకోవడానికి వీల్లేదని, చట్టబద్ధంగా, సక్రమంగా ఉండే భారతీయుల విదేశీ ఖాతాలను ఈ జాబితాలో చేర్చడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజకీయ నాయకుల పేర్లు కూడా నల్లకుబేరుల జాబితాలో ఉంటాయని వార్తలు వెలువడటంతో రెండు మూడు రోజులుగా వివిధ పార్టీల నేతలలో గుండెల్లో రైళ్లు పరుగులు తీశాయి. ప్రభుత్వం సమర్పించిన నల్లధనం కుబేరుల జాబితాలోని పేర్లు ఇవి: ప్రదీప్‌ బర్మన్‌, పంకజ్‌ చమన్‌లాల్‌ లోథ్యా, ఇక టింబ్లూ కంపెనీ, అందులోని డైరెక్టర్లు శ్రీమతి రాధా సతీష్‌ టింబ్లూ, చేతన్‌ ఎస్‌ టింబ్లూ, రోహన్‌ ఎస్‌ టింబ్లూ, శ్రీమతి అన్నా సి టింబ్లూ, శ్రీమతి మల్లికా ఆర్‌ టింబ్లూ....ఈ జాబితా వెలువడగానే బర్మన్‌ స్పందిస్తూ తమది చట్టబద్ధమైన విదేశీ ఖాతా అని, అన్ని నిబంధనలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. డాబర్‌ కంపెనీ తరఫున ఓ ప్రకటన వెలువరించారు. ప్రదీప్‌ ఎన్నారైగా ఉన్నప్పుడు ఈ ఖాతా ప్రారంభం అయిందని, నిర్వహణకు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. కాగా లోథ్యియా తనకు స్విస్‌బ్యాంక్‌ ఖాతా ఉందనే అంశాన్ని ఖండించారు. తమ ఆదాయపన్ను వివరాలను ఇప్పటికే సమర్పించామని, ఇకపై దీనిపై చెప్పడానికి ఏమీ లేదని, స్విస్‌ బ్యాంక్‌ ఖాతా లేదనే చెప్పగలమని వివరణ ఇచ్చుకున్నారు. కాగా రాధా టింబూ తనపై వచ్చిన నల్లముద్రపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అన్నీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత మాట్లాడుతానని స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: