మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన వైదొలగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత ఇక్కడ రాజకీయ పరిణామాల్లో మార్పు చోటుచేసు కుంది. బిజెపి దొడ్డిదారి మంతనాలు ఫలించాయి. ఈ పార్టీకి దీర్ఘకాల మిత్రపక్షం శివసేన కూటమి ప్రభుత్వానికి మద్దతు నిచ్చేందుకు సానుకూలతను కనబర్చింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చర్యలు వేగం పుంజుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్దపార్టీగా అవతరించిన బిజెపి మంగళవారం శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోనుంది. అనంతరం ప్రభుత్వం ఏర్పాటునకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ గవర్నర్‌ను కలవనుంది. బిజెపి సోమవారం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ''తమ నాయకుడిని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం 11 గంటలకు ఇక్కడ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జి జె.పి.నద్దా సమక్షంలో సమావేశం కానున్నారు. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్న తర్వాత తాము గవర్నర్‌ సి.విద్యాసాగరరావుని కలుసుకుని ప్రభుత్వం ఏర్పాటునకు సంసిద్ధతను వ్యక్తం చేస్తాం'' అని బిజెపి ప్రధాన కార్యదర్వి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ మీడియాకు తెలిపారు. కాగా, సిఎం పీఠం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దేవేంద్ర ఫద్నా విస్‌నే వరించనున్నట్లు సమాచారం. ఈ పదవిని ఆయనే చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 31న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అనేక మంది ఆయన కేబినెట్‌ మంత్రులు, బిజెపి ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇదిలాఉండగా, కూటమి ప్రభుత్వానికి మద్దతునిచ్చేందుకు ముందుకొచ్చిన శివసేన ప్రభుత్వంలో చేరేదీ లేనిదీ స్పష్టం చేయలేదు. బిజెపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి సానుకూలంగా ఈ పార్టీ తొలిసారిగా ప్రకటన చేసింది. ఇది 'నిలకడైన' నిర్ణ యం అని శివసేన సీనియర్‌ నాయకుడు, ప్రతినిధి సంజరు రాత్‌ ప్రకటించారు. ''ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేన, బిజెపి ఒక్కటైతే అది నిలకడగా ఉంటుంది. బిజెపి మా అనుబంధం చాలా పాతది. ఎన్నికల సమయంలో జరిగింది మేము మర్చిపోదల్చుకున్నాం. మాది భారత్‌-పాకిస్తాన్‌ లాంటి పోరు కాదు. ప్రజలు బిజెపి పక్షాన తీర్పునిచ్చారు. ఈ పార్టీ మరిన్ని స్థానాలు సంపాదించింది. బిజెపికి మద్దతునివ్వడం మా విధి. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి శివసేన ఎప్పుడూ మద్దతునిస్తుంది'' అని రాత్‌ అన్నారు. కాగా, 41 మంది ఎమ్మెల్యేలు ఉన్న శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపి బిజెపికి వెలుపల నుండి బేషరతు మద్దతునిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో 122 సీట్లు గెలుచుకున్న బిజెపికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గోవింద్‌ రాథోడ్‌ గుండెపోటుతో సోమవారం మృతిచెందడంతో ఈ పార్టీ సీట్లు ఇప్పుడు 121గా వున్నాయి. ఏడుగురు ఇండిపెండెంట్లు, చిన్నపార్టీలకు చెందిన మరికొంతమంది కూడా విశ్వాస పరీక్షలో బిజెపికి మద్దతునివ్వనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: