కొత్త రాజధానిని నాలుగు సెక్టార్లుగా విభజించి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రధానంగా భూ సమీకరణ, సేకరణ విషయాల్లో వివాదాలు తలెత్తకుండా చూసేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. దీనికోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొలివిడత రాజధానిలో నాలుగు వరకూ సెక్టార్లు ఏర్పాటు చేసే యోచన చేస్తోంది. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మాణంలో రైతుల నుంచి ముందుగా 30వేల ఎకరాల వరకూ పూలింగ్‌లో సేకరించనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైతుల నుంచి సానుకూలత వ్యక్తమవుతోందని గుర్తిస్తున్న ప్రభుత్వం, వారికి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అన్ని చర్యలపైనా దృష్టి సారిస్తోంది. ప్రధానంగా ఒక రైతు నుంచి తీసుకున్న భూమికి బదులుగా అందించాల్సిన అభివృద్ధి చేసిన భూమిని దగ్గరలోనే ఆ రైతుకు అందించడం మంచిదన్న భావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.  దీనికోసం సెక్టార్లుగా రాజధాని ప్రాంతాన్ని విభజించాలని యోచిస్తోంది. ఏ సెక్టార్‌లో రైతు భూమిని ఇచ్చాడో.. ఆ సెక్టార్లోనే అభివృద్ధి చేసిన భూమిని అందించేలా చర్యలు చేపడుతోంది. రాజధాని మొత్తం ఒకే సెక్టార్‌గా ఉంటే ఎవరికి ఎక్కడెక్కడో భూమి అందించే పరిస్థితి ఉంటుందని, ఇది రైతుల్లో వ్యతిరేకత, అసంతృప్తికి కారణమవుతుందని అందుతున్న సూచనల నేపథ్యంలో సెక్టార్లుగా రాజధానిని విభజిస్తే మేలుగా ఉంటుందన్న భావానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొత్తం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు కూడా మంత్రుల కమిటీ సిద్ధమవుతోంది. 30న మంత్రివర్గ సమావేశం పూరె్తైన వెంటనే మంత్రుల కమిటీ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి భూసేకరణను త్వరిగతం చేయాలని భావిస్తోంది. అక్కడి నుంచి నెల రోజుల్లోగా తొలి దశకు అవసరమైన భూమిని సేకరించాలని కూడా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కొత్త రాజధానిని విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం వివిధ విదేశీ సంస్థలను సంప్రదించారు. మూడు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చినట్టు సమాచారం. ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ నుంచి ఈ సంస్థలు వచ్చాయని, వాటిలో దేనికి నిర్మాణ బాధ్యత అప్పగించాలన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ మూడు దేశాలకు చెందిన సంస్థలతో విస్తృత చర్చలు జరుగుతున్నట్టు సీనియర్ మంత్రి ఒకరు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: