రాష్ట్ర విభజనకు ముందు నుంచి మొదలైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయి.. ఎవరికి వారు అనుకొంటున్న తరుణంలో కూడా ఇరు ప్రాంతాల పాలనలోనూ విభేదాలు తొంగిచూస్తున్నాయి. మంత్రుల హోదాలో ఉన్నారు... తమ తమ ప్రాంతాల ప్రయోజనాలే పరమావధి అంటున్నారు. ఇలాంటి వాదనలను కొనసాగిస్తున్నారు. అయితే ఈ వాదనలతో వారు తమ ప్రాంత ప్రజలనే టెన్షన్ పెడుతున్నారు! ఎంసెట్ , ఐపీఈ వివాదంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇటు ఏపీ మంత్రి.. అటు తెలంగాణ మంత్రి కూర్చొని చర్చించినా ఈ వివాదం సద్దుమణగలేదు. వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎంసెట్ ను, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ను ఉమ్మడిగా నిర్వహించాలని ఏపీ గవర్నమెంట్ తరపున వాదన వినిపిస్తున్నాడు ఏపీ విద్యాశాఖ మంత్రి. అయితే అలా వద్దని.. ఈ విషయంలో ఎవరి దారి వారు చూసుకొందామని అంటున్నాడు తెలంగాణ విద్యాశాఖమంత్రి. ఈ మంత్రులు ఆది నుంచి ఇదే వాదననే వినిపిస్తున్నారు. మీడియా ముందు ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి కలిసి కూర్చొని చర్చించినా కూడా వీరు ఏకాభిప్రాయాని రాలేకపోయారు. పెద్దగా రీజన్లేమీ చెప్పుకుండానే భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. వేరు వేరుగా పరీక్షలు నిర్వహించడం తమ ప్రయోజనాలకు భంగం అవుతుందనిఏపీ విద్యాశాఖ మంత్రి అంటున్నాడు. అయితే ఏ విధంగా దెబ్బపడుతుందనేది మాత్రం ఆయన వివరించలేదు. ఇక తెలంగాణ విద్యాశాఖ మంత్రి మాత్రం... సిలబస్ ఇంకా మారకుండానే మార్చేశామని అంటున్నాడు. సిలబస్ మారింది.. ఒకే విధంగా పరీక్షలు నిర్వహించడం ఎలా? అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతానికి ఇరు ప్రాంత విద్యార్థులూ ఒకే సిలబస్ ను చదువుతున్న విషయాన్ని ఆయన పట్టించుకోవడం లేదు. ఈ విధంగా ఇరు ప్రాంత మంత్రులూ.. భిన్నమైన వాయిస్ లు వినిపించడానికే ప్రాధాన్యతను ఇచ్చారు. మరి ఈ వ్యవహారంలోనూ ఏపీ, తెలంగాణలది ఎడ్డెమంటే తెడ్డెం అనే పరిస్థితే కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేది ఎవరో!

మరింత సమాచారం తెలుసుకోండి: