ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల విద్యామంత్రుల భేటీ.. షేక్ హ్యాండ్ తో మొదలై.. ఫైర్ బ్రాండ్ తో ముగిసింది. సమావేశానికి ముందు శాంతికపోతాల్లా చేతులు కలుపుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన మీడియా ప్రతినిధులకు జనానికి.. అబ్బా.. ఎంత కనువిందు దృశ్యం అనుకున్నారు. స్పీకర్ల భేటీ తరహాలో సర్దుబాటు పరిష్కారంతో ఫలితం సాధిస్తారని ఎక్స్ పెక్ట్ చేశారు. మొత్తానికి భేటీ ముగిసింది. నాలుగున్నర గంటల సమావేశం తర్వాత ముగింపు ప్రెస్ మీట్ పెట్టేసరికి.. ఆహా.. మొత్తానికి మనోళ్లు సయోధ్య సాధించారనే అంతా అనుకున్నారు. కానీ ప్రెస్ మీట్ లో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతుంటే.. తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుచెబుతున్నప్పుడే క్రమంగా విషయం అర్థమైపోయింది. దాదాపు ఐదు గంటలు మాట్లాడుకున్నా.. ఎవరి వాదన వారిదే అన్నట్టు వ్యవహరించడంతో ఇంటర్ విద్యార్థుల అయోమయానికి తెరపడలేదు.. సరికదా.. మరింత గందరగోళంగా తయారైంది. ఇంటర్‌, ఎంసెట్ పరీక్షలు కలిపి నిర్వహించాలన్న ఏపీ మంత్రి ప్రతిపాదనను... తెలంగాణ మంత్రి తిరస్కరించారు. సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై స్పష్టత రాకపోవడం వల్ల మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు. ఈ భేటీలో ఇంటర్, ఎంసెట్, ఉన్నత విద్యామండలితో పాటు పదో షెడ్యూల్ లో ఉన్న విద్యా సంస్థలపైనా ఇద్దరు మంత్రులు సమీక్షించారు. పరీక్షలు ఆలస్యమైతే విద్యార్థులు నష్టపోతారని.. విభజన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ను పోల్చవద్దని విజ్ఞప్తి చేశారు. గంటా ప్రతిపాదనతో ఏకీభవించని తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి...ఉమ్మడి పరీక్షలు ఉండబోవని... ఎట్టి పరిస్థితుల్లోనూ విడివిడిగానే పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించబోమని... ఓపెన్ కేటగిరీలో 15 శాతం రిజర్వేషన్లు యథాతథంగా అమలు చేస్తామని... దీని వల్ల రెండు ప్రాంతాల విద్యార్థులకు ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. సమావేశంలోనూ.. మీడియా ముందు.. ఎవరి వాదనలకు వారే కట్టుబడటంతో.. మరోసారి సమావేశమై చర్చించుకుందామన్న అంశంపై మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చి.. విడిపోయారు. వీరు మళ్లీ ఎప్పుడు కలుస్తారో.. ఇంటర్ విద్యార్థులకు శుభవార్త ఎప్పుడు చెబుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: