ఆళ్లగడ్డ ఉప ఎన్నిక విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించినందుకు గానూ తెలుగుదేశం పార్టీకి దక్కాల్సిన క్రెడిట్ , తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు దక్కాల్సిన క్రెడిట్.. ఉందో లేదో తెలియని జనసేన అధినేతకు దక్కుతోంది. ఇక్కడ నుంచి తన కూతురు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయంపై స్పందించిన భూమా నాగిరెడ్డి మొదట్లోనే పవన్ కల్యాన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తాజాగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిల ప్రియతో కలిసి భూమా వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలిశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల ప్రియ ఎమ్మెల్యే కావడం ఆనందాన్ని ఇచ్చే అంశమే అయినా... తన భార్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి గెలవడం, భార్య మరణంతో కూతురు రాజకీయాల్లోకి రావాల్సి రావడం బాధించే అంశమని అన్నాడు. అలాగే అఖిల ప్రియ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన నేతలకు కూడా భూమా నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలకు భూమా కృతజ్ఞతలు తెలిపాడు. ఇదే సమయంలో భూమా నాగిరెడ్డి మరోసారి పవన్ కల్యాన్ ను స్మరించడం విశేషం. పవన్ చూపిన చొరవ వల్లనే తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నికలో పోటీ పెట్టలేదనట్టుగా మాట్లాడాడు భూమా నాగిరెడ్డి. ఈ చొరవ చూపినందుకు పవన్ కు మీడియా ముఖంగా కృతజ్ఞత తెలిపాడు. మరి ఆళ్లగడ్డ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన సమయంలో ఇక్కడ పోటీకి తెలుగుదేశం రెడీగా ఉందన్న అభిప్రాయాలే వినిపించాయి. తర్వాత మాత్రం పరిణామాలు మారాయి. టీడీపీ పోటీకి దూరంగా నిలిచింది. మరి ఇప్పుడేమో ఎన్నిక ఏకగ్రీవం కావడానికి పవన్ కల్యాన్ చొరవే కారణమని భూమా నాగిరెడ్డి పలు మార్లు చెబుతున్నాడు. దీంతో మానవతా దృక్పథంతో వ్యవహరించిన క్రెడిట్ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు దక్కక.. పవన్ కల్యాన్ కు దక్కుతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: