విజయసాయిరెడ్డి... జగన్ ఆస్తుల కేసు సీబీఐ చేతిలో పడినప్పటి నుంచి మార్మోగుతున్న పేరు. జగన్ కంపెనీలకు ఆడిటర్ గా, సాక్షికి డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్న విజయసాయిరెడ్డిని సీబీఐ వాళ్లు అదుపులోకి తీసుకొన్నారు. కొన్నినెలల పాటు ఆయనను ప్రశ్నించారు. చివరకు అరెస్టు కూడా చేశారు. జైల్లో పెట్టి ప్రశ్నించారు... అయిన విజయసాయిరెడ్డి ఎక్కడా తొణికినట్టుగా కనపడలేదు. తొణకకపోవడంతోనే సాయిరెడ్డిని అరెస్టు చేశారనే అభిప్రాయాలు వినిపించాయి. ఆ తర్వాత జగన్ నే అరెస్టు చేశారు. కొన్ని నెలలకు గానీ సాయిరెడ్డికి బెయిలు లభించలేదు. బెయిల్ లభించిన అనంతరం సాయిరెడ్డి రాజకీయంగా యాక్టివ్ కావడమే విశేషమైన పరిణామం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సాయిరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఎందుకో అది జరగలేదు. నెల్లూరు జిల్లా నుంచి ఏదో ఒక నియోజకవర్గంలో విజయసాయిరెడ్డి బరిలోకి దిగుతాడని అందరూ అనుకొన్నారు. అయితే అది జరగలేదు కానీ ఎన్నికల తర్వాత మాత్రం విజయసాయిరెడ్డి యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన జిల్లా స్థాయిల్లో మీటింగులు పెడుతున్నాడు. పార్టీ నేతలతో మమేకం అవుతున్నాడు. పార్టీలో ప్రముఖ నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. జగన్ అండదండలు దండిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు నాయకులను కలుపుకుపోవడానికి... మీడియాలో నానడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉ న్నాడు. మొత్తానికి జగన్ ఆర్థిక వ్యవహారాలను సెటిల్ చేసే హోదాలో ఉండిన విజయ్ సాయిరెడ్డి రాజకీయంగా ఎదగాలని చూస్తుండటం విశేషమే. మరి ఈయన ఏ మేరకు నిలదొక్కుకొంటాడో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: